రుద్రంపూర్: సింగరేణి యాజమాన్యం కార్మికులకు మెరుగైన వైద్యం అందించేందుకు కృషి చేస్తోంది. సంస్థ వ్యాప్తంగా ఉన్న 21 ఆస్పత్రుల్లో 10 ఏరియా ఆస్పత్రులను ఏ గ్రేడ్ ఆస్పత్రులుగా ఆధునికీకరించనుంది. కొత్తగూడెం ఆస్పత్రిలో రూ. 8 కోట్లతో సిటీ స్కాన్ యంత్రం అందుబాటులోకి తేనుంది. సత్తుపల్లి ఆస్పత్రిలో క్యాజువాలీ సేవలు ప్రారంభించనున్నారు. కార్మికుల ఆరోగ్యం కోసం సంస్థ ఏటా సుమారు రూ. 300 కోట్లు ఖర్చు చేస్తోంది. వీటిలో కార్పొరేట్ రిఫరల్ ఆస్పత్రులకు అధిక మొత్తం నిధులు చెల్లించాల్సి వస్తున్నందున ఖర్చు తగ్గించుకునేందుకు ఇటీవల సంస్థ వ్యాప్తంగా హెల్త్ క్యాంపులు నిర్వహించింది. రామగుండం–1 ఏరియలో సుమారు రూ.50 కోట్లతో క్యాథ్‌ల్యాబ్ ప్రారంభించేందుకు సర్వం సిద్ధమైంది. కొత్తగూడెంలోనూ క్యాథ్‌ల్యాబ్ ఏర్పాటు చేసే యోచనలో ఉంది. ఈ సౌకర్యాలన్నీ అందుబాటులోకి వస్తే కార్మికులకు మెరుగైన వైద్యం అందే అవకాశ ఉంది.
కార్మికులకు అత్యాధునిక వైద్యం అందించేందుకు సింగరేణి యాజమాన్యం చర్యలు తీసుకుంటోంది. కొత్తగూడెం ఆస్పత్రిని సూపర్ స్పెషాలిటీగా మార్చేందుకు ఉన్నతాధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. సుమారు రూ.8 కోట్లతో సిటీ స్కాన్ యంత్రం ఏర్పాటు చేయనున్నాం.
–డాక్టర్ కిరణ్‌రాజ్‌కుమార్,
ఆస్పత్రి చీఫ్ మెడికల్ ఆపీసర్
రామగుండంలో క్యాథ్‌ల్యాబ్
ఏర్పాటుకు సిద్ధం


