ఒకే రోజు ఆరు ప్రసవాలు.. మూడు సిజేరియన్లు.. మూడు సాధారణం వైద్యుల పనితీరుపై కలెక్టర్ అభినందన
మెరుగైన వైద్యం..
ఇల్లెందు: వైద్య విధాన పరిషత్‌లోకి మారి 100 పడకల ఏరియా హాస్పిటల్‌గా మార్చిన తర్వాత ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలలో ఒకే రోజు ఆరు ప్రసవాలు జరిగాయి. ఈ ఆరు ప్రసవాల్లో మూడు సిజేరియన్లు,మూడు సాదారణ ప్రసవాలు చేశారు. డాక్టర్ సింథూ, డాక్టర్ ప్రియాంకల నేతృత్వంలో బుధవారం రోజున ఆరు ప్రసవాలు చేశారు. ఈ ప్రసవాలు పొందిన తల్లి బిడ్డలను క్షేమంగా ఆరో గ్యంగా ఉన్నారు. ఈ నెల మొదటి వారంలో 20 ప్రసవాలు జరుగగా 14 కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. ప్రస్తుత తరుణంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ.లక్ష వరకు ఖర్చవుతుండగా.. ప్రస్తుతం ఆ బాధలు తీరడం విశేషం.
పైసా ఖర్చు లేకుండా..
దీనికి తోడు సుదూర ప్రాంతాలకు వెళ్లి ఖర్చు పెట్టి ప్రసవాలు పొందలేని పేదలు ఇల్లెందు ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి విచ్చేసి సాధారణ ప్రసవం జరగని పక్షంలో సిజేరియన్‌కు సైతం సిద్ధపడి పైసా ఖర్చు లేకుండా తల్లీబిడ్డలు ఇంటికి చేరుతున్నారు. ఇల్లెందు ఏరియా హస్పిటల్‌లోని గైనకాలజిస్టులు డాక్టర్ సింధూ, ప్రయాంక, హెడ్ నర్సులు, నర్సింగ్ ఆఫీసర్లు, వారి సిబ్బంది కృషిని కలెక్టర్ అంకిత్, డీసీహెచ్‌ఎస్ డాక్టర్ జి.రవిబాబు, సూపరింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్‌లు అభినందించారు.
మెరుగుపడిన ఇల్లెందు ప్రభుత్వాస్పత్రి
ఆస్పత్రిపై నమ్మకం, విశ్వాసం, పనితీరుపై ఆదరణ చూపుతున్న ప్రజలకు మరింత నాణ్యమైన వైద్యం అందించేందుకు కృషి చేస్తున్నాం. ఇల్లెందు ఆస్పత్రిలో బ్లడ్ బ్యాంకులో రక్తం అందుబాటులో ఉంది. ఆవసరమైన వారికి రక్తం అందించేందుకు, చిన్నపిల్లల మెరుగైన వైద్యానికి ప్రత్యేక గదులతో సహా వైద్యులు అందుబాటులో ఉన్నారు. ఈ అవకాశాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ హర్షవర్ధన్, సూపరింటెండెంట్


