కస్తూర్బా విద్యాలయాల్లో
45 రోజుల ప్రత్యేక కార్యక్రమం
అమ్మ ఒడిని మరిపిస్తూ..
అక్షరాల బాట పట్టిస్తూ..
కొత్త వాతావరణానికి అలవాటు చేసి ఆత్మవిశ్వాసం పెంపు
మొదట కస్తూర్బాలో చేరినప్పుడు ఇంటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చి చాలా బాధపడ్డాను. కొత్త స్నేహితులు, కొత్త వాతావరణం కావడంతో భయమేసింది. కానీ చెలిమి కార్యక్రమంలో ఆటలు, పాటలు, యోగా వల్ల అందరితో కలిసిపోయాను. టీచర్లు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటున్నారు. దీంతో బాగా చదివి పైస్థాయికి చేరుకోవాలనే నమ్మకం వచ్చింది.
– వైష్ణవి, 6వ తరగతి, పాల్వంచ కేజీబీవీ
కస్తూర్బా విద్యాలయాల్లో విద్యార్థినులకు విద్యతో పాటు వ్యక్తిత్వ వికాసానికీ సమాన ప్రాధాన్యం ఇస్తున్నాం. కొత్తగా చేరిన బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు, తోటి విద్యార్థులతో స్నేహపూర్వక వాతావరణం ఏర్పడేందుకు ‘చెలిమి’కార్యక్రమాన్ని రూపొందించాం. ప్రతీ విద్యార్థిని ఆనందంగా నేర్చుకునేలా, మానసికంగా ధృడంగా ఎదిగేలా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నాం. – జానకీదేవి, జీసీడీఓ
కరకగూడెం: తల్లిదండ్రులకు దూరంగా తొలిసారి వసతిగృహంలో అడుగుపెట్టే బాలికల్లో భయం, బెరుకు,ఒంటరితనం ఉండడం సహజమే. ముఖ్యంగా పేద, గ్రామీణ, గిరిజన కుటుంబాలతో పాటు అనాథ బాలికలకు కొత్త వాతావరణానికి అలవాటు పడటం అంత సులభం కాదు. అలాంటి విద్యార్థినులు ఇంటి జ్ఞాపకాల నుంచి త్వరగా బయటపడి, పాఠశాలనే తమ రెండో ఇంటిగా భావించేలా చేయడానికి కస్తూ ర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ‘చెలిమి’కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనివల్ల కొత్తగా ఆరో తరగతిలో చేరిన విద్యార్థినుల్లో స్నేహభావం, మానసిక ధైర్యం, ఆత్మవిశ్వాసం, సృజనాత్మకతను పెంపొందించవచ్చు. ఇలా జిల్లాలోని 14కేజీబీవీల్లో వందలాది మందివిద్యార్థినులు కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
45 రోజుల ప్రత్యేక శిక్షణ...
కొత్తగా చేరిన విద్యార్థినులు హాస్టల్ జీవనానికి సులభంగా అలవాటు పడేలా ప్రతిరోజూ గంటపాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత నెల 15 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వారంలోని ప్రతి రోజుకు ప్రత్యేక అంశాన్ని కేటాయించారు. సోమవారం ‘అత్యవసర ఒప్పందాలు’, మంగళవారం ‘రండి నాతో కూర్చోండి’, బుధవారం ‘నా గుర్తింపు చిహ్నం’, గురువారం ‘నేను కొత్తవాడిని.. పర్వాలేదు’, శుక్రవారం ‘పుష్పం–దీపం అవగాహన’, శనివారం ‘ఈ రోజు నృత్యం చేద్దాం’వంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
నైపుణ్యాలకు పదును..
చెలిమి కార్యక్రమంలో భాగంగా బాలికలకు యోగా, కంప్యూటర్, ఆటలు, పాటలు, కథలు, చిత్రలేఖనం, పేపర్ క్రాఫ్ట్ వంటి సృజనాత్మక కార్యక్రమాల్లో శిక్షణ ఇస్తున్నారు. హాస్టల్‌లో అందరితో ఎలా కలిసిమెలిసి ఉండాలి, క్రమశిక్షణ, వ్యక్తిగత పరిశుభ్రత, పరస్పర సహకారం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు. కొత్త వాతావరణం కారణంగా కలిగే మానసిక ఒత్తిడిని తగ్గిస్తూ ప్రశాంతమైన విద్యా వాతావరణాన్ని రూపొందిస్తున్నారు.
భరోసా దిశగా..
చెలిమి కార్యక్రమం ద్వారా బాలికల్లో ఒంటరితనం తగ్గి, తోటి విద్యార్థులతో స్నేహబంధాలు పెరుగుతున్నాయి. ఉపాధ్యాయులు, వార్డెన్లు ప్రతి విద్యార్థినితో ఆప్యాయంగా మెలుగుతూ వారి భావోద్వేగాలను అర్థం చేసుకుంటున్నారు. దీంతో పాఠశాలపై అనుబంధం పెరగడంతో పాటు చదువుపై ఆసక్తి కూడా అధికమవుతోంది. ‘మేము ఒంటరివాళ్లు కాదు.. మాకు కస్తూర్బా కుటుంబం ఉంది’అనే భరోసా విద్యార్థినుల్లో పెరుగుతోందని ఉపాధ్యాయులు చెబుతున్నారు.
భయం వీడి.. భరోసా దిశగా సరికొత్త ప్రోగ్రాం


