పినపాక: కళ్లముందే ఎన్నో కలలు.. రెక్కాడితే గానీ డొక్కాడని స్థితిలో కుటుంబానికి ఆసరాగా నిలవాలనే తపన.. కానీ విధి ఆ యువకుడిపై పగబట్టింది. రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందిన ఘటన మంగళవారం మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని ఎల్సిరెడ్డిపల్లికి చెందిన మర్రి సంజయ్ (18) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఎప్పటిలాగే ఆటో తీసుకుని బయ్యారం నుంచి క్రాస్ రోడ్ వైపు వస్తుండగా ఎరువుల లోడుతో వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. సంజయ్ అక్కడికక్కడే మృతిచెందాడు. ఇప్పుడిప్పుడే ఇంటికి పెద్ద దిక్కుగా మారుతున్న కొడుకు విగతజీవిగా పడి ఉండటం చూసి తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీని, డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నామని, మృతుడి మేనమామ మద్దబోయిన జంపయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఈ–బయ్యారం ఎస్‌ఐ సురేశ్ తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం


