దుమ్ముగూడెం: మండలంలోని డబ్ల్యూఎల్ రేగుబల్లి పంచాయతీ పరిధి గ్రామాల్లోని బెల్ట్ షాపుల్లో మద్యం, నాటుసారా విక్రయాలను నిలిపివేయాలని సర్పంచ్ పూనెం విజయకుమారి అధ్యక్షతన మంగళవారం జరిగిన గ్రామసభలో తీర్మానం చేశారు. పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు, నాటుసారా విక్రయాలతో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని గ్రామ పంచాయతీలోని ప్రజల అభీష్టం మేరకు వాటిని బంద్ చేయాలని నిర్ణయించుకుని తీర్మానం చేశామని సర్పంచ్ వెల్లడించారు. ఇక నుంచి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో బెల్ట్ షాపులు, నాటుసారా విక్రయాలు జరిపితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉప సర్పంచ్ ఖాదర్‌పాషా, పంచాయతీ కార్యదర్శి యాకూబ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


