సర్వైకల్‌ కేన్సర్‌కు చెక్‌.. | - | Sakshi
Sakshi News home page

సర్వైకల్‌ కేన్సర్‌కు చెక్‌..

Mar 18 2026 9:39 AM | Updated on Mar 18 2026 9:39 AM

టీకా వేయించాలి..

14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా హెచ్‌పీవీ టీకా

జిల్లాలో 10,393 మంది గుర్తింపు

మందకొడిగా సాగుతున్న వ్యాక్సినేషన్‌

టీకాపై వ్యక్తమవుతున్న అనుమానాలు

భద్రాచలంఅర్బన్‌: ప్రపంచాన్ని కలవరపెడుతున్న అతిపెద్ద అనారోగ్య భూతం కేన్సర్‌. ఈ వ్యాధి మహిళలను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తూ శాపంగా మారుతోంది. అందులో గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ ఒకటి. గర్భాశయ ముఖ ద్వార కేన్సర్‌ హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ ఇన్‌ఫెక్షన్‌ వల్ల వస్తుంది. ఈ వైరస్‌ను నివారించడానికి హెచ్‌పీవీ టీకా రూపొందించారు. దీనిని తీసుకోవడం ద్వారా గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ను పూర్తిగా నివారించవచ్చు. ఈ టీకా వైజెనల్‌ కేన్సర్‌తపాటు మరో మూడు కేన్సర్లను కూడా నివారిస్తుందని వైద్యులు చెబుతున్నారు. 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా ఈ టీకాను అందించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఈ కేన్సర్‌కు కారణమయ్యే హెచ్‌పీవీ టైప్‌ 16, 18తో పాటు టైప్‌ 6, 11 రకాల నుంచి ఇది రక్షణ కల్పిస్తుందని ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. ఒక డోస్‌ వ్యాక్సిన్‌ అందించడం వల్ల బాలికలకు ఈ వైరస్‌ నుంచి దీర్ఘకాలిక రక్షణ అందుతుందని అంచనా వేస్తున్నారు. జిల్లాలో 10,393 మందిని టీకాకు అర్హులుగా గుర్తించారు. జిల్లాలో ఈ టీకా పంపిణీ ఈ నెల 8న ప్రారంభం కాగా ఇప్పటివరకు కేవలం 471 మందికి మాత్రమే వేశారు. ఈ వ్యాక్సిన్‌పై ఎలాంటి అపపోహలు, భయాలు పెట్టుకోవద్దని, 14 నుంచి 15 ఏళ్ల లోపు బాలికలకు ఈ టీకాను తప్పనిసరిగా వేయించాలని వైద్యాధికారులు సూచిస్తున్నారు.

ఉచితంగా వ్యాక్సినేషన్‌..

హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ 14–15 ఏళ్ల బాలికలకు ఉచితంగా అందిస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఈ మేరకు వ్యాక్సినేషన్‌ కార్యక్రమానికి ప్రణాళికలతో సిద్ధంగా ఉండాలని సూచించింది. అయితే, వ్యాక్సిన్‌పై బాలికలు, వారి తల్లిదండ్రులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించలేదనే విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హులైన బాలికలను గుర్తించినా వారు ముందుకు వచ్చేందుకు ఆసక్తి చూపడం లేదు. కరోనా సమయంలో వ్యాక్సిన్‌ వేయించుకుని.. ఇప్పుడు వాటి కారణంగా అనేక మందికి గుండెపోటు వచ్చి అకస్మాత్తుగా మృతిచెందారని, పలువురికి మోకాళ్ల నొప్పులు వచ్చి ఇబ్బంది పడుతున్నారని, ఇప్పుడు బాలికలకు ఈ వ్యాక్సిన్‌ వేయిస్తే రానున్న రోజుల్లో ఎలాంటి ఆరోగ్య సమస్యలు వస్తాయోనని తల్లిదండ్రులు శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. పదో తరగతి పరీక్షలు నడుస్తుండటంతో తక్కువ మంది బాలికలు టీకా వేయించుకున్నారని వైద్యాధికారులు వెల్లడించారు.

టీకా కొత్తదేమీ కాదు..

2006 నుంచే ఈ టీకా అందుబాటులో ఉంది. సీ్త్రల గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ నివారణకు ఉపయోగిస్తున్న హెచ్‌పీవీ టీకాను కొత్తగా ప్రవేశపెట్టారని, ఇది ఎలా పనిచేస్తుందో అనే భయం బాలికల తల్లిదండ్రుల్లో నెలకొంది. అయితే, ఈ టీకా కొత్తగా ప్రవేశపెట్టింది కాదు. 2006 నుంచే అందుబాటులో ఉంది. పలు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో ఈ టీకాకు దాదాపు రూ.10 వేలు చెల్లించి మహిళలు వేయించుకుంటున్నారు. సర్వైకల్‌ కేన్సర్‌పై అవగాహన ఉన్నవారు, డబ్బున్న వారే హెచ్‌పీవీ టీకాను వేయించుకుంటున్నారు. ఇప్పుడు ఉచితంగా అందుబాటులోకి వచ్చింది.

హెచ్‌పీవీ వ్యాక్సినేషన్‌తో గర్భాశయ ముఖద్వార కేన్సర్‌ పూర్తిగా నివారించవచ్చు. 14–15 ఏళ్లలోపు బాలికలకు మాత్రమే ప్రస్తుతం ఈ టీకా వేస్తున్నారు. దీంతో ఎలాంటి దుష్ప్రభావాలు ఉండవు. ఆయా వయసు కలిగిన బాలికలు ముందుకు రావాలి. అలాగే వారి తల్లిదండ్రులు కూడా బాలికలను ప్రోత్సహించాలి. జిల్లావ్యాప్తంగా ఉన్న అన్ని పీహెచ్‌సీలతో పాటు వైద్య విధాన పరిషత్‌ ఆస్పత్రుల్లో ఈ వ్యాక్సిన్‌ వేస్తారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది గ్రామాల్లో బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.

–తుకారాంరాథోడ్‌, డీఎంహెచ్‌ఓ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement