పాల్వంచ: పట్టణంలోని శ్రీనివాస గిరిపై కొలువుదీరిన శ్రీ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా మంగళవారం రథోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు తోలేటి నగేష్ శర్మ, ఆరుట్ల ఫణిరాజాచార్యులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పట్టువస్త్రాలు, పూల మాలలతో అలంకరించిన స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పాదాల మండపం వద్ద ముస్తాబు చేసి రథంపై ఆశీనులు చేశారు. భక్తుల గోవింద నామ స్మరణల నడుమ అంగరంగ వైభవంగా రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ కొత్తా వెంకటేశ్వరరావు, కో చైర్మన్ ముక్కంటేశ్వరరావు, బిక్కసాని సుధాకర్‌రావు, నరసింహకుమార్ పాల్గొన్నారు.
మురుగు నిల్వ ఉండొద్దు..
ములకలపల్లి: జనావాసాల మధ్య మురుగునీటి నిల్వ ఉండకుండా జాగ్రత్త పడాలని డీఆర్‌డీఓ విద్యాచందన అన్నారు. ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా సోమవారం జగన్నాథపురం గ్రామంలో పర్యటించి, వీధులను పరిశీలించారు. గ్రామ సమాఖ్యలతో సమావేశం నిర్వహించి, బ్యాంక్ రుణాలు సకాలంలో చెల్లించాలన్నారు. ప్రధాన కూడలిలో ఇంకుడుగుంత నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పరిసరాల పరిశుభ్రత పాటించాలని సూచించారు. సర్పంచ్ కుంజా వినోద్, ఎంపీఓ రమేశ్‌బాబు, ఈజీఎస్ ఏపీఓ హుస్సేన్, ఐకేపీ ఏపీఎం రామ్‌కుమార్, జీపీ కార్యదర్శి ఇబ్రహీం తదితరులు ఉన్నారు.
సేవారత్న
అవార్డు ప్రదానం
అశ్వాపురం: మండలంలోని మల్లెలమడుగు గ్రామానికి చెందిన ఐటీసీ ఉద్యోగి, కోలాటం మాస్టర్ తోకల రమేశ్‌కు ఈ నెల 16న తిరుపతిలో జరిగిన కార్యక్రమంలో సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ చేతుల మీదుగా సేవారత్న జాతీయ అవార్డు అందుకున్నారు. రమేశ్ చేస్తున్న ప్రాచీణ జానపద కోలాట ప్రదర్శనలు, ఆధ్యాత్మిక, సామాజిక సేవా కార్యక్రమాలు, మహిళా సాధికారత కోసం ఉచిత కోలాట శిక్షణ ఇవ్వటం లాంటి కార్యక్రమాలు గుర్తించిన బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ సేవారత్న జాతీయ అవార్డును రమేశ్‌కు అందజేశారు. ఆయనకు అవార్డు రావడంపై ఐటీసీ గుర్తింపు సంఘం అధ్యక్షుడు హరిప్రసాద్, ఐఎన్‌టీయూసీ అధ్యక్షుడు గోనె రామారావు, ఉద్యోగులు అభినందించారు.
ఆశ్రమ పాఠశాల
ఉదంతంపై విచారణ
చండ్రుగొండ: మండల కేంద్రం చండ్రుగొండలోని గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో జరిగిన ఉదంతంపై ఏటీడబ్ల్యూఓ చంద్రమోహన్ మంగళవారం ఆరా తీశారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన ఆయన పాఠశాలను సందర్శించి ఉపాధ్యాయులు, విద్యార్థినులతో మాట్లాడారు. బయటి వ్యక్తులు రాత్రి వేళ తరగతి గదుల్లో ప్రవేశించడం పట్ల విచారం వ్యక్తం చేశారు. మ్యాట్రిన్‌తోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థినులతో వేర్వేరుగా మాట్లాడి సమాచారం సేకరించారు. పూర్తి వివరాలతో నివేదిక ఐటీడీఏ పీఓకు అందించనున్నట్లు ఆయన వెల్లడించారు.
బస్ డ్రైవర్‌పై ప్రయాణికుడి దాడి
ఇల్లెందు: ఇల్లెందు బస్టాండ్‌లో ఓ ప్రయాణికుడు బస్ డ్రైవర్‌పై దాడి చేసిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. మహబూబాబాద్ డిపో బస్సు ఇల్లెందుకు వస్తుండగా అదే బస్సులోని శ్రావణ్ ప్రయాణిస్తున్నాడు. ఆర్డినరీ బస్సుకు ఎక్స్‌ప్రెస్ బోర్డు పెట్టి నడిపిస్తున్నావంటూ డ్రైవర్ బాలాజీతో ఘర్షణకు దిగాడు. డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇల్లెందు బస్టాండ్‌లోకి రాగానే దిగి డ్రైవర్ బాలాజీపై దాడి చేశాడు. బాలాజీ ఫిర్యాదు మేరకు సీఐ సురేశ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


