విలువిద్యలో లోహితకు స్వర్ణం
దమ్మపేట: పాల్వంచలో మంగళవారం జరిగిన జిల్లా స్థాయి సీఎంకప్ క్రీడా పోటీల్లో మండలంలోని పట్వారిగూడేనికి చెందిన కనకం లోహితశ్రీ ప్రథమస్థాయిలో నిలిచి స్వర్ణ పత కం సాధించింది. లోహితశ్రీ హైదరాబాద్‌లోని క్రీడా పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. కలెక్టర్ జితేష్ వి.పాటిల్ నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సందర్భంగా ఆమెను నాయకులు కొయ్యల అచ్యుతరావు, పైడి వెంకటేశ్వరరావు, కూరం అర్జునరావు, బొల్లికొండ నాగేశ్వరరావు తదితరులు అభినందించారు.
రాష్ట్రస్థాయి
పోటీలకు ఎంపిక
భద్రాచలంటౌన్: పట్టణంలోని సిటీ స్టైల్ జిమ్ సెంటర్‌లో నిర్వహించిన జిల్లాస్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీల్లో క్రీడాకారిణులు ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు కోచ్ రామి రెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మామిడి భూమిక బంగారు పతకం, డి.మేఘనా చౌదరి రజత పతకం సాధించారని, వీరు ఈ నెల 20, 21 తేదీల్లో హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీల్లో పాల్గొంటారని వివరించారు.
వ్యాధులపై
అవగాహన ఉండాలి
పాల్వంచరూరల్: వ్యాధులపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలని డీఎంహెచ్‌ఓ డాక్టర్ తుకారాం రాథోడ్ అన్నారు. మండల పరిధిలోని కిన్నెరసానిలో ఉన్న పీహెచ్‌సీ సబ్‌సెంటర్‌ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది పనితీరుపై ప్రత్యేక శ్రద్ధచూపాలని, అత్యవసర మందులు, ఓసీ రిజిస్టర్‌ను క్రమంగా నిర్వహించాలని సిబ్బందిని ఆదేశించారు. అనంతరం స్పర్శ్ కుష్ఠు వ్యాధి అవగాహన పక్షోత్సవాల సందర్భంగా గిరిజన గురుకుల బాలుర పాఠశాలను సందర్శించి పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధువరన్, ప్రిన్సిపాల్ శ్యామ్‌కుమార్, వైస్‌ప్రిన్సిపాల్ మోహన్ పాల్గొన్నారు.
ఆర్‌టీఐ కమిషనర్ తనిఖీ
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం జిల్లా కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లో ఆర్‌టీఐ కమిషనర్ శ్రీనివాసరావు బుధవారం తనిఖీ చేశారు. ఖమ్మం ఆర్డీఓ కార్యాలయం, ఇరిగేషన్ సర్కిల్ కార్యాలయాల్లో తనిఖీ చేసిన ఆయన ఆర్‌టీఐ దరఖాస్తులు, పరిష్కారంపై సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు దరఖాస్తుదారులు కోరిన సమాచారాన్ని నిబంధనల మేరకు ఇవ్వాలని తెలిపారు.
నేడు కార్మికుల సమ్మె
లేబర్ కోడ్ల రద్దు డిమాండ్‌తో పిలుపు
ఖమ్మంమయూరిసెంటర్: కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు కార్మికుల హక్కులను కాలరాసేలా ఉన్నాయని ఆరోపిస్తూ.. వివిధ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం సమ్మె జరగనుంది. పోరాడి సాధించుకున్న చట్టాలను రద్దు చేయడం సరికాదని నిరసించడంతో పాటు వేతనాలు, పారిశ్రామిక సంబంధాలు, సామాజిక భద్రత, వృత్తిపరమైన భద్రతకు సంబంధించిన కొత్త చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో ఈ సమ్మె చేపడుతున్నారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా కనీస వేతనం రూ.26వేలు అమలుచేయడంతో పాటు నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలని తదితర డిమాండ్లతో సమ్మెకు పిలుపునిచ్చారు. ఈమేరకు ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ, టీయూసీఐ, సీఐటీయూ, బీఆర్‌టీయూ, ఐఎఫ్‌టీయూ సంఘాల ప్రతినిధులు కొద్దిరోజులుగా సమ్మెను విజయవంతం చేయాలని పారిశ్రామిక ప్రాంతాలు, బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు, షాపింగ్ మాల్స్, పని ప్రదేశాల్లో ప్రచారం చేయడమే కాక యాజమాన్యాలకు నోటీసులు అందజేశారు.
వ్యక్తి
ఆత్మహత్యాయత్నం
పాల్వంచరూరల్: మద్యం మత్తులో బుధవారం ఓ వ్యక్తి పురుగుల మందుతాగాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. మండల పరిధిలోని ఉల్వనూరు లక్ష్మీదేవిపల్లి గ్రామానికి చెందిన పడిగె నర్సింహులు మంగళవారం రాత్రి మద్యం మత్తులో ఇంట్లో ఉన్న పురుగుల మందుతాగి అపస్మారకస్థితిలో పడిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు, స్థానికులు కొత్తగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విలువిద్యలో లోహితకు స్వర్ణం


