సప్తహస్తం! | - | Sakshi
Sakshi News home page

సప్తహస్తం!

Feb 14 2026 7:53 AM | Updated on Feb 14 2026 7:53 AM

సప్తహ

సప్తహస్తం!

అశ్వారావుపేట ఇల్లెందు కొత్తగూడెంలో హంగ్‌! ● ఉమ్మడి జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ ● ఆ పార్టీకే చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు ● అన్నిచోట్లా బీఆర్‌ఎస్‌కు ఆశాభంగమే

కల్లూరు

సత్తుపల్లి

వైరా

అశ్వారావుపేట మున్సిపాలిటీ నూతనంగా ఏర్పడింది. ఈ మున్సిపాలిటీలో తొలి చైర్మన్‌ పీఠాన్ని కాంగ్రెస్‌ కై వసం చేసుకుంది. ఇక్కడ 22 వార్డులు ఉండగా.. 17 వార్డులను కాంగ్రెస్‌ గెలుచుకుంది. రెండు వార్డుల్లో బీఆర్‌ఎస్‌ విజయం సాధించగా.. బీజేపీ ఒక వార్డులో నెగ్గింది. ఇక స్వతంత్ర అభ్యర్థులు రెండు స్థానాలు దక్కించుకున్నారు.

ఇల్లెందు మున్సిపాలిటీలో అత్యధిక వార్డులను గెలుచుకున్న కాంగ్రెస్‌ చైర్మన్‌ పీఠాన్ని కై వసం చేసుకుంది. ఇక్కడ 24 వార్డులు ఉండగా.. 19 వార్డుల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులే విజయం సాధించారు. మూడు వార్డులను బీఆర్‌ఎస్‌ దక్కించుకోగలిగింది. రెండు వార్డుల్లో స్వతంత్ర అభ్యర్థులు విజయం సాధించారు. దీంతో 25 ఏళ్ల తర్వాత ఇల్లెందు మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగురవేసింది. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ ఒంటరిగా పోటీ చేయగా.. మిగతా పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.

చేతికి జైకొట్టిన ఏడు మున్సిపాలిటీల ఓటర్లు

మున్సి‘పోల్స్‌’లో పట్టణ ఓటర్లు ‘చేతి’కే జై కొట్టారు. ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల్లోనూ కాంగ్రెస్‌ జెండా రెపరెపలాడింది. పూర్తిస్థాయి మెజార్టీతో ఆ పార్టీ చైర్మన్‌, వైస్‌ చైర్మన్‌ పీఠాలు దక్కించుకోనుంది. ఇదే సమయాన బీఆర్‌ఎస్‌కు ఏడు చోట్లా ఆశాభంగమే ఎదురైంది. ఎక్కడా కాంగ్రెస్‌కు ఆ పార్టీ అభ్యర్థులు గట్టి పోటీ ఇవ్వలేకపోయారు. – సాక్షి ప్రతినిధి, ఖమ్మం

ఏడు మున్సిపాలిటీల్లో కాంగ్రెస్‌కు స్పష్టమైన మెజార్టీ వచ్చినా కొత్తగూడెంలో హంగ్‌ ఏర్పడింది. ఇక్కడ ఇండిపెండెంట్లు, బీఆర్‌ఎస్‌ నుంచి గెలిచిన కార్పొరేటర్లు కీలకం కానున్నారు. మేజిక్‌ ఫిగర్‌ ఏ పార్టీకి దక్కకపోవడంతో సంకీర్ణంతో పాలకవర్గం ఏర్పడనుంది. కార్పొరేషన్‌లో కాంగ్రెస్‌.. సీపీఎంతో జత కట్టింది. ఇక సీపీఐ, బీఆర్‌ఎస్‌ ఒంటరిగా పోటీ చేశాయి. ఈమేరకు కాంగ్రెస్‌, సీపీఐకి సమానంగా 22 చొప్పున డివిజన్లు దక్కాయి. బీఆర్‌ఎస్‌కు ఎనిమిది, బీజేపీ, సీపీఎం ఒక్కో డివిజన్‌లో గెలవగా, ఆరు స్థానాలు ఇండిపెండెంట్లు దక్కించుకున్నారు. ఇక్కడ బీఆర్‌ఎస్‌ ఎనిమిది డివిజన్లు దక్కించుకుని కింగ్‌మేకర్‌ అయింది. అయితే మేయర్‌ పదవిని దక్కించుకోవడానికి స్వతంత్రులు ఎవరికి సహకరిస్తారు, ఎక్స్‌ అఫీషియో ఓట్లు ఏ పార్టీకి ఎన్ని ఉన్నాయో లెక్కల్లో నిమగ్నమయ్యారు. ఇదే సమయాన కూనంనేనికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కేటీఆర్‌ ఫోన్‌ చేయగా.. కాంగ్రెస్‌లోని పలువురు మంత్రులు ఆయనతో చర్చలు మొదలుపెట్టినట్లు తెలియగా పాలకవర్గం ఏర్పాటుపై శనివారం స్పష్టత రానుంది.

నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్‌ అధిష్టించనుంది. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు సాగుతుందనే అంచనాలు ఉండగా.. వాటిని పటాపంచలు చేస్తూ కాంగ్రెస్‌ విజయాన్ని చేజిక్కించుకుంది. ఇక్కడ 20 వార్డులు ఉండగా.. 12 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులు గెలిచారు. ఏడు వార్డుల్లో బీఆర్‌ఎస్‌, ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు.

సత్తుపల్లి మున్సిపాలిటీపై కాంగ్రెస్‌ జెండా ఎగిరింది. ఇక్కడ మొత్తం 23 వార్డులు ఉండగా కాంగ్రెస్‌కు 17, బీఆర్‌ఎస్‌కు ఆరు వార్డులు దక్కాయి. ఇక్కడ బరిలో నిలిచిన ఇతర పార్టీలేవీ ప్రభావం చూపలేకపోవడంతో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ అధిక్యత చాటింది.

వైరా మున్సిపాలిటీకి రెండోసారి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది. ఈ మున్సిపాలిటీలో కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేయగా.. మిగిలిన బీఆర్‌ఎస్‌, సీపీఐ, సీపీఎం కూటమిగా ముందుకెళ్లాయి. ఇక్కడ మొత్తం 20 వార్డులకు 12 వార్డుల్లో కాంగ్రెస్‌, ఐదు వార్డుల్లో బీఆర్‌ఎస్‌ గెలిచాయి. సీపీఎం, సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు ఒక్కో స్థానం సాధించారు.

సప్తహస్తం!1
1/1

సప్తహస్తం!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement