ఆది నుంచీ సీపీఐదే ఆధిపత్యం | - | Sakshi
Sakshi News home page

ఆది నుంచీ సీపీఐదే ఆధిపత్యం

Feb 14 2026 7:53 AM | Updated on Feb 14 2026 7:53 AM

ఆది నుంచీ సీపీఐదే ఆధిపత్యం

ఆది నుంచీ సీపీఐదే ఆధిపత్యం

పడుతూ.. లేస్తూ సాగిన కాంగ్రెస్‌ పోరు

చివరలో పుంజుకున్న బీఆర్‌ఎస్‌

బోణీ కొట్టిన బీజేపీ, సత్తా చాటిన స్వతంత్రులు

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైనప్పటి నుంచి చివరి వరకు సీపీఐ జోరు కనబరిచింది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగా 11 గంటల నుంచే డివిజన్ల వారీగా తొలి రౌండ్‌లో అభ్యర్థుల ఆధిక్యాల వివరాలు వెల్లడి కాగా, ఆరంభం నుంచే సీపీఐ హవా నడిచింది. అంతవరకు ఆధిక్యంలో ఉన్న సీపీఐ అభ్యర్థుల సంఖ్య మధ్యాహ్నం 1 గంట సమయానికి 22కి చేరుకుంది. అదే సమయంలో కాంగ్రెస్‌ అభ్యర్థుల సంఖ్య 19కే పరిమితమైంది. దీంతో కాంగ్రెస్‌ గెలుపు నల్లేరు మీద నడకే అనే పరిస్థితి నుంచి సీపీఐ ఏం చేయబోతుందో అనే చర్చ ప్రారంభమైంది. మరోవైపు గెలుపుపై నమ్మకం సన్నగిల్లిన కాంగ్రెస్‌ అభ్యర్థులు కౌంటింగ్‌ కేంద్రం నుంచి బయటకు రావడం మొదలైంది. మధ్యాహ్నం 3 గంటల సమయానికి సీపీఐ ఆధిక్యం 26కు చేరుకోగా కాంగ్రెస్‌ బలం 22కు వచ్చింది. అప్పటికే నాలుగు స్థానాల్లో స్వతంత్రులు స్పష్టమైన ఆధిక్యం సాధించారు. మిగిలిన స్థానాల్లో కాంగ్రెస్‌, సీపీఐ, బీఆర్‌ఎస్‌ మధ్య ఆధిక్యం వెంటవెంటనే మారుతూ విజయం దోబుచులాడింది. చివరకు లెక్కింపు పూర్తయ్యే సరికి సీపీఐ 22, కాంగ్రెస్‌ 22, బీఆర్‌ఎస్‌లు 08 డివిజన్లలో విజయం సాధించాయి

బోణీ కొట్టిన బీజేపీ

మున్సిపల్‌ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బోణీ కొట్టింది. కొత్తగూడెం కార్పొరేషన్‌లో నాలుగో డివిజన్‌ నుంచి ఆ పార్టీ తరఫున చేరుగు భాగ్యలక్ష్మి 115 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. అశ్వారావుపేటలో 17వ వార్డు నుంచి గుంటా గీతాశ్రీ 45 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో గెలిచిన వారిలో ఆమే పిన్న వయస్కురాలు.

టీడీపీకి నిరాశే

కొత్తగూడెం కార్పొరేషన్‌ ఎన్నికల్లో సీపీఐతో కలిసి టీడీపీ ఎన్నికల బరిలో నిలిచింది. ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు సైకిల్‌ గుర్తుపై కాకుండా స్వతంత్రులగా మూడు చోట్ల పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో సీపీఐ విజయభేరీ మోగించగా దాని మిత్రపక్షమైన టీడీపీ మూడు చోట్ల ఓడిపోయింది. ఇల్లెందులో 7 వార్డు నుంచి ముద్రగడ వంశీ బరిలో నిలిచినా విజయం దక్కలేదు. కొత్తగూడెంలో ఆరుగురు స్వతంత్రులు విజయం సాధించగా ఇల్లెందులో ఇద్దరు గెలిచారు. అశ్వారావుపేటలో రెండు వార్డులు ఇండిపెండెంట్‌ల ఖాతాలో పడ్డాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement