పాల్వంచలో ‘పాతికేళ్ల’ జోష్
కొత్త ఉత్సాహం
కార్పొరేషన్ అవడం వల్లే..
● 25 సంవత్సరాల తర్వాత పుర పోరు ● 2000 సంవత్సరంలో చివరి మున్సిపల్ ఎన్నికలు
పాల్వంచ: పాల్వంచ మున్సిపాలిటీ పరిధిలో పాతికేళ్ల తర్వాత ఎన్నికలు జరగడంతో పట్టణ వాసుల్లో నూతనోత్సాహం నెలకొంది. దీంతో ఓటు వేసేందుకు పలు కేంద్రాల్లో బారులుదీరారు. ద్వితీ య శ్రేణి మున్సిపాలిటీగా ఉన్న పాల్వంచలో గతంలో 24 వార్డులు ఉండగా కొత్తగూడెం కార్పొరేషన్‌లో విలీనం కావడంతో 27 డివిజన్లు ఏర్పాటయ్యా యి. పాల్వంచ మున్సిపాలిటీకి 2000 సంవత్సరంలో చివరిసారిగా ఎన్నికలు జరిగాయి. ఆ తర్వాత ఏజెన్సీ చట్టాల పేరుతో కొందరు కోర్టును ఆశ్రయించడంతో ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయింది. అధికారుల పాలనే కొనసాగుతుండగా, ఇతర చోట్ల ఎన్నికలు జరుగుతుంటే ఇక్కడ మాత్రం పాలక వర్గం లేక ప్రజల్లో నైరాశ్యం నెలకొంటోంది. వీధి లైట్లు, డ్రెయినేజీ, పారిశుద్ధ్య కార్యక్రమాలతోపాటు పౌర సేవల కోసం పట్టణవాసులు మున్సిపల్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చేది. సమస్యలు చెప్పుకునేందుకు వార్డు కౌన్సిలర్లు లేక ఇబ్బంది పడేవారు. ఈ క్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కృషితో కార్పొరేషన్ ఏర్పాటైంది. తాజా ఎన్నికలు రావడంతో ప్రజల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. బుధవారం జరిగిన ఎన్నికల్లో పట్ణణంలో 354 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇందులో యువకులే ఎక్కువగా ఉన్నారు.
పాల్వంచకు ఎన్నికలు రావడంతో పట్టణంలో పాతికేళ్ల తర్వాత కొత్త ఉత్సాహం నెలకొంది. ఇప్పటివరకు ప్రజల్లో ఉన్న నైరాశ్యం తొలగింది. సమస్యలకు పరిష్కారం లభించే అవకాశం ఉంది. –కాల్వ దేవదాస్, పట్టణవాసి
కార్పొరేషన్ అవడం వల్లే ఎన్నికలు వచ్చాయి. గతంలో ఎన్నికలు లేకపోవడంతో సమస్యల పరి ష్కారం కోసం అధికారుల చు ట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వచ్చే ది. –కుడికాలు ఆంజనేయులు, న్యాయవాది
పాల్వంచలో ‘పాతికేళ్ల’ జోష్


