భయపెడుతున్న మొసళ్లు.. | - | Sakshi
Sakshi News home page

భయపెడుతున్న మొసళ్లు..

Feb 11 2026 7:37 AM | Updated on Feb 11 2026 7:37 AM

భయపెడుతున్న మొసళ్లు..

భయపెడుతున్న మొసళ్లు..

● గోదావరి తీరంలో వాటి సంచారం ● నాగినేనిప్రోలు సమీపంలో 30కి పైగా మొసళ్లు ● హడలిపోతున్న స్థానికులు

● గోదావరి తీరంలో వాటి సంచారం ● నాగినేనిప్రోలు సమీపంలో 30కి పైగా మొసళ్లు ● హడలిపోతున్న స్థానికులు

బూర్గంపాడు: గోదావరి తీరంలో మొసళ్లు భయపెడుతున్నాయి. మండలంలోని నాగినేనిప్రోలు సమీపంలోని గోదావరి తీరంలో 30కి పైగా మొసళ్లు సంచరిస్తున్నట్లు స్థానికంగా చర్చసాగుతోంది. మొసళ్ల సంచారంతో స్థానికులు భయభ్రాంతులకు గురవుతున్నారు. భద్రాచలం రామాలయానికి ఎదురుగా గోదావరి ఒడ్డున మొసళ్లు కనిపిస్తున్నాయి. ఐటీసీ నుంచి విడుదలయ్యే వ్యర్థ జలాల్లో ఐదేళ్లుగా మొసళ్లు కనిపిస్తున్నాయి. ఈ ఏడాది మొసళ్ల సంఖ్య మరింత ఎక్కువగా ఉందని అటుగా వెళ్తున్న రైతులు, పశువుల కాపరులు చెబుతున్నారు. ఐటీసీ వ్యర్థ జలాలు పైప్‌లైన్‌తో గోదావరిలో విడుదలయ్యే ప్రాంతంలో ఈ మొసళ్ల సంచారం ఎక్కువగా ఉంది. అక్కడ నీరు లోతుగా ఉండటంతో మొసళ్లకు అనువుగా మారింది. ఇసుక తిన్నెలపై పడుకుని ఏదైనా శబ్దమైతే మొసళ్లు నీటిలోకి తక్షణమే జారుకుంటున్నాయి. ఈ మొసళ్లు సారపాక – నాగినేనిప్రోలు మధ్యన ప్రవహించే పెదవాగు గోదావరిలో కలిసే ప్రాంతం నుంచి పాత గొమ్మూరు వరకు సుమారు రెండు కిలోమీటర్ల మేర మొసళ్ల సంచారం ఉంటోంది. చేపలు, అక్కడ తిరిగే పక్షులు, పురుగులను మొసళ్లు తింటున్నాయి. అప్పుడప్పుడూ నీళ్లలోకి దిగే మేకలు, గొర్రెలు, దూడలను కూడా మొసళ్లు పట్టుకుంటున్నాయని స్థానికులు అంటున్నారు.

జాగ్రత్తగా ఉండాల్సిందే..

భద్రాచలం రామాలయానికి వచ్చే భక్తులు గోదావరిలో స్నానాలు చేసేందుకు వస్తుంటారు. వారు భద్రాచలం వైపున రద్దీగా ఉండటంతో పడవలలో ఇవతలి వైపునకు వచ్చి స్నానాలు చేస్తుంటారు. అటు నుంచి ఇటు వైపునకు భక్తులు వచ్చే ప్రాంతానికి కూతవేటు దూరంలోనే ఈ మొసళ్ల సంచారం ఎక్కువగా ఉంది. పంటలకు సాగునీరు అందించేందుకు రైతులు గోదావరి ఒడ్డున విద్యుత్‌ మోటార్లను ఏర్పాటు చేసుకుంటారు. మొసళ్ల భయంతో వారు అటు వైపునకు వెళ్లేందుకు భయపడుతున్నారు. విద్యుత్‌ మోటార్ల మరమ్మతులు ఉంటే చాలా జాగ్రత్తగా నీళ్లలోకి దిగి మోటార్లను బయటకు తీయాల్సి వస్తోందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏటికేడు మొసళ్ల సంఖ్య పెరుగుతుండటం భయాందోళన కలిగిస్తోందని స్థానికులు చెబుతున్నారు. గోదావరి ఒడ్డున ఐటీసీ వ్యర్థ జలాల్లో సంచరిస్తున్న మొసళ్లను కిన్నెరసానిలోని మొసళ్ల సంరక్షణ కేంద్రానికి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement