ఓటుకు బహుమతులు..!
● అశ్వారావుపేట పలు వార్డుల్లో నగదు పంపిణీ? ● మహిళలకు చీరలు, కుక్కర్లు కూడా..
అశ్వారావుపేటరూరల్: మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సమీపించడంతో అభ్యర్థులు తమ పరిధిలోని ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ మేరకు అశ్వారావుపేటలోని పలు వార్డుల్లో కాంగ్రెస్, సీపీఎం, బీఆర్‌ఎస్, బీజేపీలతో పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు కూడా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఓటుకు నోటుతో పాటు బహుమతుల పంపిణీ మొదలుపెట్టినట్లు తెలిసింది. రెండు వార్డుల నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులు చైర్మన్ రేసులో ఉండగా, ఒకరు ఓటుకు రూ.5 వేలు, ఇంటికో చీర, ఇంకొకరు ఓటుకు రూ.2,500 ఇచ్చాడని సమాచారం. అలాగే, ఇంకో వార్డులో ఓ అభ్యర్థి ఓటుకు రూ.3 వేలు, చీర, జాకెట్, గాజులు, ఇదే వార్డులో మరో అభ్యర్థి ఓటుకు రూ.3 వేలతోపాటు రైస్ కుక్కర్, స్టీల్ క్యారేజీ, మరో వార్డులో ఓటుకు రూ.2,500, చీర, లేడీస్ హ్యాండ్ బ్యాగ్ పంపిణీ చేశారని విశ్వసనీయంగా తెలిసింది. ఇంకొన్ని వార్డుల్లో ఓటుకు రూ.వేయి, చీర, జాకెట్ ఇవ్వగా.. వీటికి తోడు మద్యం, బిర్యానీతో విందులు ఏర్పాటు చేసినట్లు తెలిసింది. అయితే, కొందరు అభ్యర్థులు, వారి అనుచరులు మంగళవారం తెల్లవారుజాము నుంచి మధ్యాహ్నం వరకు బహిరంగంగానే ఓటర్లకు నగదు, బహుమతులు పంపిణీ చేస్తున్నా ఎన్నికల అధికారులు కన్నెత్తి చూడకపోవడం గమనార్హం.
ఓటుకు బహుమతులు..!


