దొంగల ముఠా అరెస్టు
చండ్రుగొండ: పలు చోరీలకు పాల్పడిన నలుగురిని అరెస్టు చేసినట్లు కొత్తగూడెం డీఎస్పీ ఆదినారాయణ తెలిపారు. చండ్రుగొండ పోలీస్ స్టేషన్‌లో మంగళవారం వివరాలు వెల్లడించారు. చండ్రుగొండలో జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా నలుగురు వ్యక్తులు అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పట్టుకుని విచారించగా ఏపీలోని శారదకాలనీకి చెందిన చిల్లరి సురేశ్, గుంటూరు జిల్లా పత్తిపాడుకు చెందిన జల్లెపల్లి వెంకటేశ్వరరావు, హైదరాబాద్‌కు చెందిన బండారి వంశీ, ఖమ్మం జిల్లా ఏన్కూరుకు చెందిన గాదె నాగరాజుగా తేలింది. వీరు ముఠాగా ఏర్పడి కొంతకాలంగా ఎవరూ లేని ఇళ్ల తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించి, డబ్బు, ఆభరణాలు చోరీ చేస్తున్నారని, వీరి నుంచి రూ.50 వేలు నగదు, రూ.3.5 లక్షల విలువైన నకలీ నోట్లు, నాలుగు మొబైళ్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. అపహరించిన బంగారు, వెండి ఆభరణాలను విక్రయించి హైదరాబాద్‌లో కొనుగోలు చేసిన నకిలీ రూ.500 నోట్లను కొత్తగూడెం, చండ్రుగొండ, గుంటూరు ప్రాంతాల్లో చలామణి చేసేందుకు ప్రణాళిక రూపొందించుకున్నట్లు డీఎస్పీ వివరించారు. సమావేశంలో జూలూరుపాడు సీఐ శ్రీలక్ష్మి, చండ్రుగొండ, జూలూరుపాడు, అన్నపురెడ్డిపల్లి ఎస్‌ఐలు శివరామకృష్ణ, బాదావత్ రవి, విజయసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


