నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారి నిత్యకల్యాణ వేడుక మంగళవారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. ఆ తర్వాత స్వామివారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. కాగా, మంగళవారాన్ని పురస్కరించుకుని ఆంజనేయస్వామి వారికి అభిషేకం, ప్రత్యేక పూజలు చేశారు.
రామయ్యను దర్శించుకున్న
విజయేంద్రప్రసాద్
భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారిని ప్రముఖ సినీ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి తండ్రి, రాజ్యసభ సభ్యుడు విజయేంద్రప్రసాద్ మంగళవారం దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ ఈఓ దామోదర్‌రావు స్వాగతం పలకగా అర్చకులు వేదాశీర్వచనం చేసి, స్వామివారి జ్ఞాపిక, ప్రసాదం అందజేశారు. ఈ సందర్భంగా భద్రాద్రి క్షేత్ర విశిష్టత గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అనతరం అనుబంద ఆలయాలను సందర్శించారు.
నేటి నుంచి జాతీయ స్థాయి అథ్లెటిక్స్
అశ్వాపురం: మండల కేంద్రంలోని గౌతమీనగర్ కాలనీలో ఆల్ ఇండియా డీఏఈ 40వ స్పో ర్ట్స్ అండ్ కల్చరల్ మీట్‌లో భాగంగా జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలు బుధవారం ప్రారంభం కానున్నాయి. భారత అణుశక్తి విభాగంలోని డైరెక్టరేట్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ సర్వీసెస్ అండ్ ఎస్టేట్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ కె.మహాపాత్ర ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ప్రతీ ఏడాది డీఏఈ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ మీట్‌లో అణుశక్తి విభాగం పరిధిలో ఒక్కోయూనిట్‌లో ఒక్కో క్రీడా పోటీలను నిర్వ హిస్తుండగా అశ్వాపురం భారజల కర్మాగారం అథ్లెటిక్స్ పోటీలకు ఆతిథ్యం ఇస్తోంది. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడోత్సవాలకు డీఏఈ పరిధిలోని వివిధ రాష్ట్రాల క్రీడాకారులు రానున్నారు. పోటీల విజయవంతానికి జీఎం శ్రీని వాసరావు ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీల ద్వారా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాల క్రీడాకారులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వసతి, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు.
వరల్డ్ బుక్ ఆఫ్
రికార్డ్స్‌లో స్థానం
చుంచుపల్లి: పర్యావరణ పరిరక్షణ కోసం మొ క్కలు నాటుతున్న కొత్తగూడేనికి చెందిన విశ్వామిత్ర చౌహాన్‌కు వరల్డ్‌బుక్‌ఆఫ్ రికార్డ్స్‌లోస్థానం దక్కింది. ఈ మేరకు మంగళవారం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయనను వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ నిర్వాహకుడు, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ వరి ధర్ శ్రీరామ సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ దేశాల ప్రముఖులు విలియం జెజ్లర్, పూనమ్ జెజ్లర్, నవాల్‌సాగర్ తదితరులు పాల్గొనగా ఇప్పటివరకు విశ్వామిత్ర 1,119 మొక్కలు నాటడంపై అభినందించారు.
1,334.97 మె.టన్నుల యూరియా
చింతకాని: చింతకాని మండలం పందిళ్లపల్లి రేక్ పాయింట్‌కు ఐపీఎల్‌కంపెనీకి చెందిన 1,334.97 మెట్రిక్ టన్నుల యూరియా మంగళవారం చేరింది. ఇందులో ఖమ్మం జిల్లాకు 634.97 మె.టన్నులు, భద్రాద్రి జిల్లాకు 200 మె.టన్నులతో పాటు మహబూబాబాద్ జిల్లాకు 400 మె. టన్నులు సరఫరా చేసినట్లు ఏఓ(టెక్నికల్) పవన్‌కుమార్ తెలి పారు. మిగిలిన వంద మెట్రిక్ టన్నులను బఫర్ స్టాక్‌గా నిల్వ చేసినట్లు వెల్లడించారు.
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం
నేత్రపర్వంగా రామయ్య నిత్యకల్యాణం


