ప్రలోభాలకు గురి కావొద్దు
● స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి ● కలెక్టర్ జితేష్ వి పాటిల్
ఇల్లెందు: ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కని, ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా స్వేచ్ఛగా ఓటు వేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ జితేష్ వి పాటిల్ కోరారు. మంగళవారం ఆయన ఇల్లెందు జేకే సింగరేణి హైస్కూల్ గ్రౌండ్‌లో మున్సిపల్ ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల విధులు కేటాయించినా, హాజరు కాని అధికారులుంటే వారిపై చర్యలు తప్పవన్నారు. ఏ ఎన్నికల్లో అయినా పట్టణాల్లో ఓటింగ్ శాతం తక్కువగా నమోదు అవుతోందని, మున్సిపల్ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటుహక్కు వినియోగించుకోవాలని కోరారు.
ఎన్నికలు పారదర్శకంగా
నిర్వహించాలి..
పాల్వంచ: ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ జితేష్ వి.పాటిల్ అన్నారు. పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళశారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతీ బ్యాలెట్ బండిల్‌పై సీల్, అధికారుల సంతకాలు తప్పనిసరిగా ఉండేలా చూడాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి వసతి, వైద్య శిబిరం, అల్పాహారం, భోజన వసతి, టెంట్లు వంటి మౌలిక వసతులు కల్పించామని చెప్పారు. పోలింగ్ నిర్వహణలో ఎలాంటి సమస్యలు ఉత్పన్నమయినా వెంటనే తన దృష్టికి తీసుకురావాలని సిబ్బందికి సూచించారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
అశ్వారావుపేటరూరల్: ఎన్నికల ప్రక్రియ ముగిసేంతవరకు అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి జితేష్ వి పాటిల్, పరిశీలకులు అమయ్‌కుమార్ అన్నారు. అశ్వారావుపేట వ్యవసాయ కళాశాలలో ఏర్పాటుచేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం వారు సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలని, పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా చూడాలని ఆదేశించారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆయా కార్యక్రమాల్లో కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ బి.సుజాత, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపల్ కమిషనర్లు గణేష్, బి.నాగరాజు, తహసీల్దార్లు రవికుమార్, రామకృష్ణ, ఎంపీడీఓలు ధన్‌సింగ్, అప్పారావు, అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల ప్రత్యేకాధికారి కార్తీక్, ఇల్లెందు మున్సిపల్ మేనేజర్ అంకుషావళి, డీఈ మురళి, ఏఈ నవీన్ పాల్గొన్నారు.


