ఎన్నికలకు పటిష్ట బందోబస్తు
● ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలి ● ఎస్పీ రోహిత్‌రాజు
పాల్వంచ: జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పటిష్ట పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని ఎస్పీ రోహిత్‌రాజు తెలిపారు. ప్రజలు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు. పాల్వంచలోని అనుబోస్ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన సామగ్రి పంపిణీ కేంద్రాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సిబ్బంది జాగ్రత్తగా విధులు నిర్వర్తించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద 1,200 మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశామన్నారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో నిరంతర నిఘా కోసం ప్రత్యేక బృందాలను నియమించామని వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన అనుబోస్ కళాశాల పరిసర ప్రాంతాలను డాగ్, బాంబ్ స్క్వాడ్ బృందాలతో నిరంతర తనిఖీలు నిర్వహిస్తున్నామని వివరించారు. కార్యక్రమంలో డీఎస్పీ సతీష్, సీఐ సతీష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


