జెండా పాటే ప్రామాణికం
ఖమంవ్యవసాయం: మిర్చి కొనుగోళ్లలో జెండా పాట ధరను వ్యాపారులు ప్రామాణికంగా పాటించాలని మార్కెటింగ్ శాఖ వరంగల్ రీజియన్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి సూచించారు. జెండాపాట కంటే తక్కువ ధరతో కొనుగోలు చేయగా ఇటీవల ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో రైతులు ఆందోళన చేశారు. ఈ మేరకు సోమవారం ఖమ్మం వచ్చిన ఆమె రైతులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో ప్రస్తుతం విదేశీ ఎగుమతులు లేవని, దేశీయంగా 15వేల బస్తాల వరకు పంపించే అవకాశముండగా అంతకు మించి సరుకు వస్తే సమస్యలు ఎదురవుతున్నాయని వ్యాపారులు వివరించారు. ఈ సంర్భంగా డీడీ మాట్లాడుతూ జెండాపాట, మోడల్ ధరలకు మిర్చి కొనుగోళ్లు జరపాలని సూచించారు. అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడుతూ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మిర్చి సాగు, దిగుబడులు తగ్గాయని తెలుస్తోందన్నారు. ధర గత ఏడాది ఇదే సమయాన రూ. 14 వేలు ఉంటే ఇప్పుడు రూ. 19వేల వరకు పలుకుతోందని తెలిపారు. ఈనేపథ్యాన ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. కాగా, గత ఏడాది సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లలో తాత్కాలిక రిజిస్ట్రేషన్లు(టీఆర్) అమలుచేయగా జరిగిన అక్రమాలపై ఉద్యోగులకు చార్జిమెమోలు జారీ చేయగా, వారు ఇచ్చే సమాధానం ఆధారంగా చర్యలు ఉంటాయని డీడీ తెలిపారు. ఇప్పటికే పలు జిల్లాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్లు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను సరెండర్ చేశామని వెల్లడించారు. డీడీ వెంట ఖమ్మం మార్కెట్ కార్యదర్శి పి.ప్రవీణ్‌కుమార్, సహాయ కార్యదర్శి వీరాంజనేయులు తదితరులు ఉన్నారు.
మిర్చి కొనుగోళ్లను పరిశీలించిన
డీడీ పద్మావతి


