13 వరకు అక్షరాస్యత వారోత్సవాలు
సూపర్‌బజార్(కొత్తగూడెం): కేవైసీ – మీ బ్యాంక్ ఖాతాను సురక్షితంగా ఉంచడంలో మీ మొదటి అడుగు’అనే ఇతివృత్తంతో భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు నిర్వహిస్తోంది. అందులో భాగంగా ప్రతీ బ్యాంక్ శాఖ తమ పరిధిలోని ఒక గ్రామంలో ప్రజలకు కేవైసీపై అవగాహన కల్పించేందుకు శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించింది. సోమవారం కార్యక్రమానికి సంబంధించిన వాల్‌పోస్టర్లను కలెక్టరేట్‌లో కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ ఆవిష్కరించారు. ఒక బ్యాంక్‌లో కేవైసీ అప్‌డేట్ చేయడం ద్వారా మిగిలిన బ్యాంకుల్లోనూ అప్‌డేట్ చేసే వ్యవస్థ సీకేవైసీ అందుబాటులోకి వచ్చిందని, ఈ విధానంలో 14 అంకెల సీకేవైసీ నంబర్ జారీ చేస్తారని, ఈ నంబర్‌ను అన్ని బ్యాంకుల్లోని ప్రజల ఖాతాకు అనుసంధానం చేయడం ద్వారా కేవైసీ అప్‌డేట్ అవుతుందని వివరించారు. 77990 22129 నంబర్‌కు కస్టమర్ రిజిస్టర్డ్ మొబైల్ నుంచి మిస్డ్ కాల్ ఇస్తే సీకేవైసీ నంబర్ సులభంగా తెలుసుకోవచ్చని తెలిపారు.
ఆహార భద్రతా ప్రమాణాలు పకడ్బందీగా అమలు
జిల్లాలో ఆహార భద్రతా ప్రమాణాలను పకడ్బందీగా అమలు చేయాలని, ప్రజలకు ఆరోగ్యకరమైన, నాణ్యమైన ఆహారం అందేలా సంబంధిత శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ జితేశ్ వి.పాటిల్ అధికారులను ఆదేశించారు. తన చాంబర్‌లో అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్‌తో కలిసి సోమవారం నిర్వహించిన జిల్లాస్థాయి ఆహార భద్రతా, ఆరోగ్యకరమైన ఆహారాలపై సలహా కమిటీ సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. హోటళ్లు, రెస్టారెంట్లు, ఆహార పదార్థాల విక్రయ, తయారీ కేంద్రాలు తప్పనిసరిగా ఆహార భద్రతా ప్రమాణాలను పాటించాలని స్పష్టం చేశారు. పాటించని వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రతీ నెల ఆస్పత్రుల్లో నమోదవుతున్న ఫుడ్ పాయిజన్ కేసులను గుర్తించి, కారణాలను విశ్లేషించి, నివారణ చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలోని 5 అంగన్వాడీ కేంద్రాలు, 5 పాఠశాలలు, 5 ప్రభుత్వ, ప్రైవేట్ వసతి గృహాలను సందర్శించి, ఆహార భద్రతకు సంబంధించి తీసుకోవాల్సిన చర్యలపై సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించాలని సూచించారు. రాబోయే శ్రీరామనవమిని దృష్టిలో ఉంచుకొని ఏర్పాటు చేసే స్టాళ్లు, హోటళ్ల యజమానులకు ఆహార భద్రతా ప్రమాణాలపై శిక్షణ తరగతులు నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో జెడ్పీ సీఈఓ నాగలక్ష్మి, జిల్లా ఆహార భద్రతా అధికారి శరత్‌తోపాటు అధికారులు తుకారాంరాథోడ్, స్వర్ణలత లెనీనా, త్రినాథ్‌బాబు, ప్రేమ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.


