విద్యుదాఘాతంతో కేబుల్ ఆపరేటర్ మృతి
ఇల్లెందురూరల్/కారేపల్లి: ఇల్లెందు మండలం సుదిమళ్ల గ్రామ పంచాయతీ పరిధి ఐటీఐ సమీపాన పనులు చేస్తున్న కేబుల్ ఆపరేటర్ జువ్వాజి లాలయ్య (45) విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. సుభాష్‌నగర్ నుంచి లలితాపురం వరకు రోడ్డు వెడల్పు పనుల్లో భాగంగా ఇటీవల కొత్త స్తంభాలను అమర్చారు. ఈ మేరకు రాఘవాపురంలో కేబుల్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న లాలయ్య స్తంభాలపై టీవీ కేబుల్ అమర్చే పనులకు సోమవారం సిద్ధమయ్యాడు. అయితే, స్తంభాల పక్కనే బూడిదంపాడు నుంచి ఇల్లెందు సబ్‌స్టేషన్‌కు విద్యుత్ సరఫరా చేసే 33 కేవీ లైన్ ఉంది. కేబుల్ వేసే పనుల్లో నిమగ్నమైన లాలయ్య పక్కనే ఉన్న విద్యుత్ తీగలకు తాకగా షాక్‌కు గురై పైనుంచి కిందపడ్డాడు. ఆయనను ఇల్లెందు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కాగా, లాలయ్యకు భార్య లక్ష్మితో పాటు ఇద్దరు కవల కుమార్తెలు సహా నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఆయన మృతితో భార్య, పిల్లలతో పాటు వృద్ధులైన తల్లిదండ్రులు నాగేశ్వరరావు – సరోజ చేసిన రోదనలు అందరినీ కంటతడి పెట్టించాయి. ఘటనపై కుటుంబీకుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఇల్లెందు సీఐ సురేశ్ తెలిపారు.
పురుగులమందు తాగిన వ్యక్తి..
భద్రాచలంఅర్బన్: ఇంట్లో గొడవపడి పురుగులమందు సేవించిన ఓ వ్యక్తి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడని పోలీసులు తెలిపారు. భద్రాచలం పట్టణంలోని సుభాష్‌నగర్‌కాలనీకి చెంది కృష్ణార్జున్‌రావు (33) భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఖమ్మంలో ఉంటున్నాడు. ఇంట్లో గొడవపడి.. కాలనీలో ఉంటున్న తల్లి వద్దకు వచ్చాడు. ఈ నెల 7వ తేదీన కృష్ణార్జున్‌రావు పురుగులమందు తాగగా స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందాడు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టినట్లు టౌన్ సీఐ నాగరాజు తెలిపారు.
బైక్‌ను ఢీకొట్టిన
టిప్పర్ డ్రైవర్‌పై కేసు
పాల్వంచరూరల్: వెనుక నుంచి వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్‌పై సోమవారం పోలీసులు కేసు నమోదు చేశారు. మండలంలోని రంగాపురం గ్రామానికి చెందిన మాలోతు చంద్రమోహన్ ఈ నెల 5న ద్విచక్రవాహనంపై పినపాక పట్టీనగర్ నుంచి ఇంటికి వస్తున్నాడు. వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొట్టడంతో చంద్రమోహన్ గాయపడ్డాడు. బాధితుడి సోదరుడు రమేశ్ ఫిర్యాదు చేయగా.. ప్రమాదానికి కారణమైన టిప్పర్ డ్రైవర్ చింతా నాగేశ్వరరావుపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్‌ఐ సుధాకర్ తెలిపారు.


