● రండీ.. వచ్చి వెళ్లండి !
● వలస ఓటర్లపై అభ్యర్థుల గురి ● దూరం నుంచి వస్తే చార్జీలు, ఖర్చుల పేరిట వల
అశ్వారావుపేట రూరల్: మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్‌కు సమయం సమీపిస్తుండడంతో బరిలో ఉన్న ప్రధాన పార్టీల, స్వతంత్ర అభ్యర్థులు పోల్ మేనేజ్‌మెంట్‌పై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఉద్యోగ, ఉపాధి నిమిత్తం ఇతర ప్రాంతాల్లో ఉంటున్న వారిని స్వస్థలాలకు రప్పించేలా పాట్లు పడుతున్నారు. అశ్వారావుపేట మున్సిపాలిటీలో 22 వార్డులకు గాను 78 మంది అభ్యర్ధులు పోటీలో ఉండగా, 16,850 మంది ఓటర్లు ఉన్నారు. ప్రధానంగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. ఒక్కో వార్డులో 657 – 848 మంది ఓటర్ల గాను కనీసం 30 – 60 మంది వివిధ ప్రాంతాలకు వలస వెళ్లారు. ఇప్పటికే వీరి జాబితా సిద్ధం చేయడంతో పాటు ఫోన్ నంబర్లు సేకరించి కుటుంబీకులు, బంధువులు, స్నేహితుల ద్వారా ఫోన్లు చేయిస్తున్నారు.
హైదరాబాద్, వరంగల్, ఏపీలోని ఏలూరు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, జంగారెడ్డిగూడెం ప్రాంతాల్లో వివిధ పనులు, ఉన్నత విద్య, ఉపాధి కోసం పలువురు వెళ్లారు. వీరందరినీ పోలింగ్ జరిగే ఈనెల 11వ తేదీన రప్పించేలా పార్టీల నాయకులు, అభ్యర్థులు దృష్టి సారించారు. ఆర్టీసీ బస్సు చార్జీలతో పాటు ఇతర ఖర్చులన్నీ తామే చూసుకుంటామని భరోసా ఇస్తున్నారు. సామూహికంగా వస్తే ప్రత్యేక వాహనం కూడా సమకూరుస్తామని చెబుతున్నారు. ఇప్పటికే పలువురికి ఫోన్ పే, గూగుల్ పే ద్వారా నగదు కూడా పంపినట్లు సమాచారం. ఒకటి, రెండు ఓట్లే కీలకంగా మారనున్న నేపథ్యాన ఎవరినీ వదలకుండా పోలింగ్ స్టేషన్‌కు రప్పించేలా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.


