ఆమెదే ఓటు, సీటు! | - | Sakshi
Sakshi News home page

ఆమెదే ఓటు, సీటు!

Feb 8 2026 4:11 AM | Updated on Feb 8 2026 4:11 AM

ఆమెదే ఓటు, సీటు!

ఆమెదే ఓటు, సీటు!

ఓటర్ల జాబితాలో అతివలదే ఆధిపత్యం ఏడు మున్సిపాలిటీల్లో ఆరు చైర్‌పర్సన్‌ పీఠాలు వారికే రిజర్వ్‌ ప్రచారంలోనూ దూసుకుపోతున్న నారీమణులు

కార్పొరేషన్‌, మున్సిపల్‌ ఎన్నికల బరిలో అతివలు దూసుకెళ్తున్నారు. ఓటర్లలో మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండగా, అభ్యర్థులు కూడా అదే స్థాయిలో పోటీ పడుతుండడం విశేషం. ఉమ్మడి జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌, ఏడు మున్సిపాలిటీల్లో వీరి ఆధిక్యత స్పష్టమవుతోంది. పురుషుల కన్నా మహిళా ఓటర్లు 8,467 మంది ఎక్కువగా ఉండగా.. ఏడు మున్సిపాలిటీల్లో ఆరు చైర్‌పర్సన్‌ పీఠాలు వారికే రిజర్వ్‌ అయ్యాయి. దీంతో మహిళలు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేలా బరిలోకి దిగి విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. – సాక్షిప్రతినిధి, ఖమ్మం
మహిళలు పురుషులు

కొత్తగూడెం కార్పొరేషన్‌

70,314

64,431

ఏడు మున్సిపాలిటీలు 1,01,164

92,697

వారిదే అధిపత్యం

కొత్తగూడెం కార్పొరేషన్‌తోపాటు సత్తుపల్లి, మధిర, వైరా, ఏదులాపురం, కల్లూరు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో మహిళా ఓటర్లసంఖ్యే ఎక్కువగా ఉంది. ఏడు మున్సిపాలిటీల్లో మొత్తం 1,93,893 మంది ఓటర్లు ఉండగా.. వీరిలో పురుషులు 92,697 మంది, మహిళా ఓటర్లు 1,01,164 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళలు 8,467 మంది ఎక్కువగా ఉండడం విశేషం. ప్రతీ మున్సిపాలిటీలో ఇదే పరిస్థితి ఉండగా, అభ్యర్థుల జయాపజయాల్లో వారి ఓట్లే కీలకం కానున్నాయి. అతివలు ఎవరికి మద్దతుగా నిలిస్తే వారిదే విజయమనే చర్చ సాగుతోంది. ఇక కొత్తగూడెం కార్పొరేషన్‌ పరిధిలోనూ 1,34,775 మంది ఓటర్లు ఉండగా.. 64,431 మంది పురుషులు, 70,314 మంది మహిళా ఓటర్లు ఉన్నారు.

ఏడింటిలో ఆరు వారికే..

రాజకీయాల్లో తమ సత్తా చాటడమే కాక ప్రజాసేవ చేయాలనుకునే అతివలకు మున్సిపల్‌ ఎన్నికలు వేదికగా మారాయి. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలోని ఏడు మున్సిపాలిటీలకు గాను సత్తుపల్లి, మధిర, వైరా, అశ్వారావుపేట చైర్‌పర్సన్‌ పీఠాలు జనరల్‌ మహిళకు రిజర్వు కాగా.. ఏదులాపురం మున్సిపాలిటీ ఎస్సీ మహిళకు, ఇల్లెందు మున్సిపాలిటీ బీసీ మహిళకు రిజర్వ్‌ అయ్యాయి. కల్లూరు మున్సిపాలిటీ ఒక్కటే ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది. అలాగే కొత్తగూడెం కార్పొరేషన్‌ మేయర్‌ పదవి కూడా ఎస్టీ జనరల్‌కు రిజర్వ్‌ అయింది.

బరిలో 473 మంది..

కొత్తగూడెం కార్పొరేషన్‌ సహా ఏడు మున్సిపాలిటీల్లో 223 డివిజన్లు, వార్డుల్లో మొత్తం 953 మంది అభ్యర్థులు పోటీకి దిగారు. వీరిలో దాదాపు సగం మేర 473 మంది మహిళా అభ్యర్థులు ఉన్నారు. డివిజన్లు, వార్డుల్లో మహిళలకు రిజర్వు చేసిన స్థానాల్లోనే కాక కొన్ని జనరల్‌ సీట్లలోనూ ఆయా పార్టీలు మహిళా అభ్యర్థులను బరిలోకి దింపాయి. మహిళల ఓట్లను రాబట్టుకోవడం ఇందుకు ఒక కారణమైతే, ఎక్కువ మున్సిపాలిటీలు మహిళలకు రిజర్వ్‌ కావడంతో ముందు జాగ్రత్తగా వారినే బరిలో నిలిపినట్లు చర్చ సాగుతోంది. కౌన్సిలర్లుగా విజయం సాధిస్తే చైర్‌పర్సన్‌ పీఠానికి పోటీలో ఉండొచ్చనే భావనతో మహిళా అభ్యర్థులు గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నా రు. ఆరింటనాలుగుస్థానాలు జనరల్‌మహిళలకు రిజ ర్వ్‌ అయిన నేపథ్యాన అందరూ చైర్‌పర్సన్‌ రేసులో ఉన్నట్లుగా భావిస్తూ విస్తృత ప్రచారం చేస్తున్నారు.

ఓటర్ల జాబితా ఆధారంగా..

అభ్యర్థులంతా మహిళా ఓట్ల సాధనే లక్ష్యంగా ప్రచారం చేస్తున్నారు. పార్టీల నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు నిర్వహించి ఏ డివిజన్‌ / వార్డులో మహిళా ఓటర్లు ఎక్కువగా ఉన్నారో అక్కడ ఒకటికి రెండుసార్లు ప్రచారానికి వెళ్తున్నారు. దాదాపు ప్రతీ డివిజన్‌, వార్డులోనూ మహిళా ఓటర్లే ఎక్కువగా ఉండడంతో అందరినీ పోలింగ్‌ స్టేషన్‌కు రప్పించి తమకే ఓటు వేయించేలా ‘ముందస్తు’ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వార్డుల వారీగా ఓటర్ల జాబితా ఆధారంగా ఇంటింటికీ వెళ్లి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. బరిలో ఉన్న మహిళా అభ్యర్థులు సెంటిమెంట్‌గా అతివల ఓట్లు దక్కించుకునేలా ప్రచారంలో దూసుకెళ్తున్నారు.

మున్సిపల్‌ బరిలో 473 మంది మహిళలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement