పాత పద్ధతికే సై..
ఓల్డ్ ఈజ్ గోల్డ్..
కనిపించని సోషల్ మీడియా
ఇన్‌ఫ్లుయె ున్సర్ల హవా
సంప్రదాయరీతిలోనే సాగుతున్న ప్రచార సరళి
ప్రయాణ టికెట్ల బుకింగ్ నుంచి ఆఫీసులో పనులు చేసేవరకు అన్ని రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) కీలకంగా మారుతోంది. గంటలు, రోజుల సమయం పట్టే పనులను క్షణాల్లో చేస్తూ అన్ని రంగాల్లోనూ దూసుకుపోతోంది. నిత్య జీవితంలో సోషల్ మీడియా ప్రభావం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, ఎన్నికల ప్రచారంలో మాత్రం ఏఐ హవా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయె ున్సర్ల ప్రభావం ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు. సంప్రదాయ పద్ధతిలోనే అభ్యర్థులు ప్రచారం చేసుకుంటున్నారు. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
పాటలు, పోస్టర్ల రూపంలో..
ఎన్నికల ప్రచారంలో అభ్యర్థి పోటీ చేసే స్థానం, ఎన్నికల కమిషన్ కేటాయించిన గుర్తు, బలపరుస్తున్న పార్టీలు.. ఇలా అన్ని అంశాలను వివరించే వాల్‌పోస్టర్లు, కరపత్రాలు ఇంటింటి ప్రచారంలో ఉపయోగపడతాయి. అలాగే లేటెస్ట్ ట్రెండ్‌ను అనుసరిస్తూ ప్రచార రథం, అభ్యర్థి గుణగణాలు, లక్ష్యాలను వివరించే పాటలు వినిపించడం కూడా ఇప్పుడు తప్పనిసరిగా మారింది. రాష్ట్రంలో ప్రతీ రాజకీయ పార్టీకి అందులో అగ్రనేతల కోసం రూపొందించిన ప్రత్యేక పాటలు సందర్భానుసారంగా ఇప్పటికీ ప్రజల నోళ్లలో విస్తృతంగా నానుతున్నాయి.
చిటికెలోనే డిజైన్..
రాష్ట్ర స్థాయిలో జరిగే ఎన్నికల్లో ప్రధాన పార్టీలు, నాయకుల కోసం ప్రచార సామగ్రి తయారీ, పాటల రూపకల్పనకు ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. కానీ స్థానిక అంశాల ఆధారంగా జరిగే మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం కోసం ప్రత్యేక సంపత్తిని సమకూర్చుకోవడం కష్టం. మరోవైపు గతానికి భిన్నంగా ఈసారి నామినేషన్ల ప్రక్రియ చివరి రోజు వరకు ఏ డివిజన్/వార్డు నుంచి ఎవరు, ఏ పార్టీ తరఫున బరిలో ఉంటారనే అంశంపై ఉత్కంఠ నెలకొంది. బరిలో నిలిచే విషయంలో స్పష్టత లేకపోవడంతో ప్రచారానికి తక్కువ సమయం చిక్కింది. దీంతో ఏ పనైనా క్షణాల్లో చక్కబెట్టే చాప్ జీపీటీ, గూగుల్ జెమినైన్ వంటి ఏఐ టూల్స్ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి సోషల్ మీడియా పేజీలు ఎన్నికల ప్రచారంలో ప్రధాన భూమిక పోషిస్తాయనే వాదనలు ముందుగా వినిపించాయి. దీనికి తగ్గట్టే ఏఐ సాయంతో చిటికెలో కరపత్రాల డిజైన్, నిమిషాల వ్యవధిలో పాటల రూపకల్పనకు అవకాశం ఉంది. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో ఏఐని ఎలా ఉపయోగించాలనే అంశంపై సవివరమైన ప్రాంప్ట్‌లతో సహా విస్తృతమైన కంటెంట్ అందుబాటులో ఉంది. అదే విధంగా సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లపై ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు ఇన్‌ఫ్లుయె ున్స ర్లు, వారికి సంబంధించిన పేజీలు వందల సంఖ్యలో అందుబాటులో ఉన్నాయి. అయితే, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీలు, కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల ప్రచార సరళిని పరిశీలిస్తే, ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు కొత్త తరహా ప్రచారంపై పెద్దగా మక్కువ చూపించడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఓటర్లను ఆకట్టుకునేందుకు అధునాతన సాంకేతికతపై ఆధారపడడం కంటే గడపగడపకూ వెళ్లడమే శ్రేయస్కరమనే అభిప్రాయం ఇప్పటికీ రాజకీయ పక్షాల్లో నెలకొంది. అందుకు తగ్గట్టుగానే ప్రధాన పార్టీలతో పాటు ఇండిపెండెంట్లు సైతం స్థానికంగా ఉన్న ప్రింటింగ్ ప్రెస్సుల్లోనే క్యాంపెయిన్ మెటీరియల్ డిజైన్ చేయించుకునేందుకు మొగ్గు చూపారు. ఇక ఏఐ టూల్స్‌తో కొత్త పాటలు కంపోజ్ చేయడం కంటే ఇప్పటికే పాపులరైన ‘మూడు రంగుల జెండా పట్టి’ ‘గులాబీ జెండలమ్మా’, ‘ఎర్రజెండెర్రజెండ ఎనియ్యల్లో’ తదితర ట్యూన్లకే స్థానిక అవసరాలకు తగ్గట్టుగా కొత్త సాహిత్యంతో పాటలు తయారు చేయించుకుని ప్రచారంలోకి దూకారు. అభ్యర్థులు ఇంటింటి ప్రచారంతో చెమటోడ్చుతుండగా.. స్టార్ క్యాంపెయినర్ల కార్నర్ మీటింగ్‌లకు జనం పోటెత్తుతున్నారు.
ఎన్నికల ప్రచారానికి
దూరంగా ఏఐ టూల్స్


