కమ్యూనిస్టులు గెలిస్తేనే అభివృద్ధి
సూపర్‌బజార్(కొత్తగూడెం): కొత్తగూడెం కార్పొరేషన్ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే అభివృద్ధి శరవేగంగా జరుగుతుందని సీపీఐ జాతీయ నాయకుడు డాక్టర్ కె.నారాయణ అన్నారు. శనివారం ఆయన రామవరం, బర్మాక్యాంపు, ప్యూన్‌బస్తీ, పాత కొత్తగూడెం ఏరియాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిని గెలిపించడం ద్వారానే పాల్వంచతో కలిపి కొత్తగూడెం కార్పొరేషన్ ఏర్పాటైందనే విషయాన్ని ఓటర్లు గుర్తించాలన్నారు. మూడు దశాబ్దాలుగా పాలకవర్గం లేని పాల్వంచకు ఎన్నికలు జరిపిస్తున్న ఘనత కూడా సీపీఐదే అన్నారు. ఎన్నికల్లో ఓట్ల కోసం ఊరు,పేరు లేనివారు వస్తున్నారని, అలాంటి వారిపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. నిత్యం ప్రజలతో ఉంటూ వారి కష్టసుఖాల్లో పాలుపంచుకునే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కూనంనేని సాంబశివరావు ఎమ్మెల్యేగా గెలిచాక ఈ ప్రాంతాలు ఎంతో అభివృద్ధి చెందాయని అన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు భాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి ఎస్‌కే సాబీర్‌పాషా తదితరులు మాట్లాడగా నాయకులు సలిగంటి శ్రీని వాసరావు, దుర్గరాశి వెంకటేశ్వర్లు, ఎస్‌కే ఫహీమ్, జి. వీరస్వామి, మునిగడప వెంకటేశ్వర్లు, భూక్యా శాంతి శ్రీ, సాహేరా బేగం, వడాల ఆకాంక్ష పాల్గొన్నారు.
సీపీఐ జాతీయ నేత నారాయణ


