ఆటో, లారీ ఢీ
● యువతి మృతి, మరో ఇద్దరికి తీవ్రగాయాలు
ములకలపల్లి: బంధువుల ఇంటికి వచ్చిన యువతి గురువారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా, మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. కాలిగాయంతో చికిత్స పొందుతున్న బంధువును పరామర్శించేందుకు వెళ్లి వస్తున్న క్రమంలో ఆటో, లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మండలపరిధిలోని కొత్తగంగారం గ్రామానికి కారం రాజాబాబు ఇంటికి దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెం గ్రామంలో నివసించే తమ్ముడు కారం వెంకటేష్ కూతురు నాగేశ్వరి (23) ఇటీవల వచ్చింది. అదే గ్రామానికి చెందిన కల్లూరి ప్రశాంత్ కాలికి గాయంకాగా కొత్తగూడెంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో అదే గ్రామానికి చెందిన కణితి భూలక్ష్మి, కల్లూరి ప్రమీల, రాజబాబు కూతురు సంధ్య, మరో బంధువు పాల్వంచకు చెందిన సోడే రమేష్‌తో కలిసి నాగేశ్వరి కొత్తగూడెం వెళ్లి ప్రశాంత్‌ను పరామర్శించి వస్తున్నారు. సాయంత్రం అందరూ తిరిగి ఆటోలో వస్తుండగా మాధారం గ్రామం వద్ద పాల్వంచ వైపు వెళుతున్న లారీ, ఆటో ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో తీవ్ర గాయాలై నాగేశ్వరి ఘటనాస్థలిలోనే ప్రాణాలు కోల్పోయింది. కారం సంధ్య, కణితి భూలక్ష్మి తీవ్రంగా గాయపడగా, చికిత్స నిమిత్తం కొత్తగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రమీల స్వల్ప గాయాలతో బయటపడింది. కాగా ఆటో నడుపుతున్న కల్లూరి రమేష్‌తోపాటు సోడే రమేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్సై మధుప్రసాద్ తెలిపారు.


