పరీక్షా కేంద్రాల తనిఖీ
కొత్తగూడెంఅర్బన్: ఇంటర్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షల కేంద్రాలను ఇంటర్మీడియట్ బోర్డు డిప్యూటీ సెక్రటరీ సీహెచ్. హేమచందర్ గురువారం తనిఖీ చేశారు. కొత్తగూడెం, పాల్వంచ, అశ్వారావుపేట, ములకలపల్లి, భద్రాచలం ప్రాంతాల్లోని పలు పరీక్షా కేంద్రాలను సందర్శించారు. విద్యార్థులకు కల్పించిన వసతులు, ప్రశ్నపత్రాల గోప్యత, పరీక్షల నిర్వహణపై ఆరా తీశారు. ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. గురువారం రెండు సెషన్లలో కలిపి 2,412 మందికిగాను 2,320 మంది హాజరయ్యారని, 92 మంది గైర్హాజరైనట్లు అధికారులు వెల్లడించారు. డీఐఈఓ వెంకటేశ్వరరావు ఉన్నారు.
సమయ పాలన పాటించాలి
అశ్వాపురం: రేషన్ డీలర్లు సమయపాలన పాటించాలని తహసీల్దార్, ట్రైనీ కలెక్టర్ సౌరభశర్మ అన్నారు. గురువారం మండల పరిధిలోని పాములపల్లి, మిట్టగూడెం, జగ్గారం, అశ్వాపురం గ్రామ పంచాయతీల్లోని రేషన్ దుకాణా లను, అశ్వాపురంలోని ఎంఎల్‌ఎస్ పాయింట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు ఇబ్బంది కలగకుండా రేషన్ బియ్యం పంపిణీ చేయాలని సూచించారు. పాములపల్లిలో పొలాల్లో నాట్లు వేస్తున్న మహిళా కూలీలతో సౌరభశర్మతో ముచ్చటించారు.


