పొద్దుపోయినా బుకింగ్ కావట్లే!
గోదాంలు వెలవెల..
● యాప్‌లో యూరియా బుకింగ్ కోసం రైతుల పాట్లు ● అవగాహన, అధునాతన స్మార్ట్ ఫోన్లు లేక ఆందోళన ● మీ సేవ కేంద్రాలకు వెళ్లి బుకింగ్ చేసుకుంటున్న వైనం
బూర్గంపాడు: వానాకాలం సీజన్‌లో యూరియా కోసం రైతులు నానా అవస్థలు పడ్డారు. రోజుల తరబడి క్యూలైన్లు కట్టారు. రోడ్లెక్కి నిరసన తెలిపారు. ఈ పరిస్థితులను అధిగమించి రైతులకు సక్రమంగా యూరియా అందించాలనే ఆలోచనతో ప్రభుత్వం ఫెర్టిలైజర్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఐదారు రోజులుగా జిల్లాలో రైతులు యాప్ ద్వారా బుక్ చేసుకుంటే, ఆ తర్వాత డీలర్ల వద్ద కొనుగోలు చేసే వీలుకల్పించారు. అయితే క్షేత్రస్థాయిలో యాప్‌ను వినియోగించుకోవటం చాలామంది రైతులకు తలనొప్పిగా మారింది. మారుమూల గ్రామాల్లో ఇంటర్‌నెట్ సిగ్నల్స్ ప్రాబ్లమ్స్, మరికొన్ని ప్రాంతాల్లో అవగాహన లేకపోవటంతో రైతులకు ఇబ్బంతులు తప్పడంలేదు. జిల్లాలో ఫెర్టిలైజర్ యాప్‌లో రైతులు 23,125 బస్తాల యూరియాను ఇప్పటివరకు బుక్ చేసుకోగా, ఇందులో 15,775 బస్తాలు రైతులకు అందించారు.
అవగాహన కల్పించని అధికారులు
కొత్త డిజిటల్ విధానంపై కనీస అవగాహన కల్పించకపోవడం, చదువుకోని రైతులు, స్మార్ట్‌ఫోన్ అలవాటులేని సామాన్య రైతులు యాప్‌ను ఎలా ఉపయోగించాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. యూరియా బుకింగ్ చేసుకోలేని రైతులు సమీపంలోని నెట్ సెంటర్లను, మీసేవ కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. బుకింగ్ చేసినందుకు మీ సేవ నిర్వాహకులు బస్తాకు రూ. 50 వరకు తీసుకుంటున్నట్లు రైతులు చెబుతున్నారు. అరకొర ఆదాయంతో కాలం వెళ్లదీసే రైతుకు ప్రతీ బస్తా యూరియా కోసం ఇలా అదనపు ఖర్చు చేయడం భారంగా మారింది.
అత్యాధునిక ఫోన్లలోనే..
యాప్ పనితీరుపై కూడా రైతుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అత్యాధునిక 5ఏ మొబైల్స్‌లో మాత్రమే యాప్ వేగంగా స్పందిస్తోంది. గ్రామీణ రైతుల వద్ద అధికంగా ఉండే సాధారణ 4ఏ ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్ పూర్తిగా మొరాయిస్తోంది. పేజీలు లోడ్ అవ్వడానికి ఎక్కువ సమయం తీసుకోవడం, తరచూ సర్వర్ సమస్యలు తలెత్తడం వంటి కారణాలతో ఒక్కో బుకింగ్ కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ఇక మారుమూల గిరిజన ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ సిగ్నల్స్ సరిగా లేకపోవటంతో అక్కడి రైతులు యూరియా బుకింగ్ కోసం సిగ్నల్స్ ఉన్న ప్రాంతాలకు వెళ్లాల్సివస్తోంది. దీనివల్ల పొలం పనులు వదులుకుని, ఎరువుల కోసం స్మార్ట్‌ఫోన్లతో కుస్తీ పట్టాల్సి వస్తోంది. మరికొందరు రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాలకు ఫోన్ నంబర్ లింక్ లేకపోవడం శాపంగా మారింది. ఇలాంటి రైతులకు యాప్‌లో బుకింగ్ చేసుకునే అవకాశం లేకపోవడంతో మళ్లీ ఏఈఓల చుట్టూ తిరగాల్సి వస్తోంది.
పొలం పనులు జోరుగా సాగే సమయంలో యూరియా కోసం సెల్‌ఫోన్ పట్టుకుని రోడ్ల మీద తిరుగుతున్నాం. సర్కారు కొత్తగా తెచ్చిన యాప్ మాకేం అర్థం కావడం లేదు. మా దగ్గర ఉండేవి చిన్న ఫోన్లు. అందులో యాప్ అసలు ఓపెన్ కావడమే లేదు. ఎరువుల దుకాణం దగ్గరికి పోతే యాప్‌లో బుక్ చేసుకోవాలంటున్నారు. మాకు తెలీక నెట్ సెంటర్ల దగ్గరికి వెళ్లి నిరీక్షించాల్సి వస్తోంది. ఇలా పొద్దున పోతే పొద్దుపోయేదాకా ఆ ఫోన్ల చుట్టే తిరగాల్సి వస్తోంది. ప్రభుత్వం స్పందించి మా సమస్యలు పరిష్కరించాలి.
– పోలెబోయిన ముసలయ్య, రైతు, కరకగూడెం
గతంలో యూరియా పంపిణీ సమయంలో రైతులతో కిటకిటలాడిన సొసైటీ గోదాంలు, ఫెర్టిలైజర్ షాపులు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. స్టాక్ అందుబాటులో ఉన్నా యాప్ బుకింగ్ నిబంధన అమల్లో ఉండటంతో రైతులు నేరుగా వెళ్లి తీసుకునే వీలు లేకుండా పోయింది. ప్రభుత్వం స్పందించి యాప్‌ను సామాన్యులకు అర్థమయ్యేలా సులభతరం చేయాలని రైతులు కోరుతున్నారు. తక్కువ నెట్‌వర్క్ స్పీడ్ ఉన్నా పనిచేసేలా సాంకేతిక మార్పులు చేయాలని, ఫోన్ నంబర్ లింక్ లేని రైతులకు ప్రత్యామ్నాయ పద్ధతుల్లో ఎరువులు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
పొద్దుపోయినా బుకింగ్ కావట్లే!


