గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
● అధికారం లేని ప్రత్యర్థులతో అభివృద్ధి సాధ్యమా ? ● రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
కొత్తగూడెంఅర్బన్/సుజాతనగర్/అశ్వారావుపేట: ఎన్నికల్లో కాంగ్రెస్, సీపీఎం అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. గురువారం ఆయన కొత్తగూడెం కార్పొరేషన్, అశ్వారాపేట మున్సిపాలిటీల్లో రోడ్ షో నిర్వహించారు. బహిరంగ సభ, కార్నర్ మీటింగ్‌ల్లో మాట్లాడారు. ఎన్నికల వేళ స్వతంత్రుల ముసుగులో వచ్చే కొత్త అవతారాలను నమ్మొద్దని, మంత్రికి సన్నిహితుడినంటూ వచ్చే వారు ఎవరికీ దగ్గర కాదని స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం సొంత మనుషులమని చెప్పుకునే వారి పట్ల కార్యకర్తలు, ఓటర్లు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. అధికారం చేతిలో లేని ప్రత్యర్థులు ప్రజలకు ఏం చేస్తారని ప్రశ్నించారు. గృహ నిర్మాణం, రెవెన్యూ శాఖలు తన వద్దే ఉన్నాయని గుర్తు చేస్తూ, ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇచ్చే అధికారం తనకే ఉందని అన్నారు. ఏప్రిల్ నుంచి మరో విడత ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని చెప్పారు. కాంగ్రెస్, సీపీఎం కూటమి అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. 52 నుంచి 55 డివిజన్లను గెలిచి కొత్తగూడెం కార్పొరేషన్‌లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని అన్నారు. అశ్వారావుపేటలో ఇళ్లు లేని నిరుపేదలకు 500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరహాలో మున్సిపల్ ఫలితాల్లో కూడా కాంగ్రెస్ మొదటి విజయం అశ్వారావుపేటలోనే ఉంటుందని అన్నారు. అశ్వారావుపేటకు మున్సిపల్ భవనం మంజూరు చేశామని, దొంతికుంట చెరువు ఆధునీకరణతోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సర్వే నంబరు 911లో అర్హులకు పట్టాలిస్తామని, 1228 సర్వే నంబరులోని సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలు తోట దేవీప్రసన్న, సీపీఎం జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు, నాయకుడు కొక్కెరపాటి పుల్లయ్య, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు, కాంగ్రెస్ నాయకులు లింగం పిచ్చిరెడ్డి, చింతలపూడి రాజశేఖర్, జేబీ శౌరి, సుందర్‌రాజు, ఆయా డివిజన్, వార్డు అభ్యర్థులు లింగం పుష్పావతి, మాలోత్ అనిత, బానోత్ కోటేష్, చింతలపూడి శ్రావణి, బాలిశెట్టి సత్యభామ, జూపల్లి రమేష్ బాబు, జూపల్లి శశికళ తదితరులు పాల్గొన్నారు.


