వ్యయ నియంత్రణపై సమీక్ష
సూపర్‌బజార్(కొత్తగూడెం): మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వ్యయ నియంత్రణను పకడ్బందీగా అమలు చేసేందుకు జిల్లా వ్యయ పరిశీలకురాలు లావణ్య, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన బుధవారం కలెక్టరేట్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు, అక్రమ నగదు, మద్యం, బహుమతులు, ఇతర ప్రలోభాల నియంత్రణకు చేపడుతున్న చర్యలపై చర్చించారు. ఆయా బృందాలు తమ పరిధిలో నిర్వహిస్తున్న తనిఖీలు, చెక్‌పోస్టుల పనితీరు, పట్టుబడిన కేసులు, నమోదు చేసిన నివేదికల వివరాలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం లావణ్య మాట్లాడుతూ.. ఎన్నికల వ్యయంపై నిరంతరం నిఘా కొనసాగించాలని, తనిఖీల్లో పట్టుబడిన వివరాలను తక్షణమే సంబంధిత పోర్టల్‌లో నమోదు చేయాలని సూచించారు. బృందాలు సమన్వయంతో సమర్థంగా విధులు నిర్వర్తించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన మాట్లాడుతూ క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న బృందాలు మరింత అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద రవాణా, కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు.


