మెరుగైన వైద్యసేవలు అందించాలి
బూర్గంపాడు: మారుమూల గ్రామాల నుంచి వచ్చే ఆదివాసీలకు మెరుగైన సేవలు అందించాలని ఐటీడీఏ పీఓ రాహుల్ వైద్యులను ఆదేశించారు. బూర్గంపాడు సీహెచ్‌సీని మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని ఐపీ, ఓపీ గదులతో పాటు ల్యాబ్, ఆపరేషన్ థియేటర్, నూతనంగా నిర్మిస్తున్న ఆస్పత్రి భవన సముదాయాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. గర్భిణులకు మెరుగైన వైద్యం అందించాలన్నారు. మారుమూల ప్రాంతాల మహిళలకు డెలివరీ సమయంలో అంబులెన్స్‌ల ద్వారా ఆస్పత్రికి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. కాన్పు అనంతరం తల్లీ, బిడ్డలు క్షేమంగా ఉండేలా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. రూ 2.70 కోట్లతో నిర్మిస్తున్న ఆస్పత్రి భవనాలను జూన్ వరకు అందుబాటులోకి తేవాలన్నారు. కార్యక్రమంలో ఏడీఎంహెచ్‌ఓ సైదులు, ఆస్పత్రి సూపరింటెండెంట్ ముక్కంటేశ్వరరావు, వైద్యులు అనిత, నిషార్ పాల్గొన్నారు. ఆ తర్వాత మండలంలోని ఉడ్‌యార్డు గిరిజన ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. తాను అడిగిన ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానాలను చెప్పకపోవడంతో ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల రోజుల్లో వారిలో మార్పు కనిపించాలని, లేదంటే చర్యలు తప్పవని హెచ్చరించారు.
క్రీడాకారులకు అభినందన..
భద్రాచలం: జనవరి 7, 8, 9వ తేదీల్లో ఏటూరు నాగారంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాచలం ఐటీడీఏ పరిధిలోని విద్యార్థులు ఓవరాల్ చాంపియన్ షిప్ దక్కించుకున్నారు. దీంతో పీఓ రాహుల్ తన చాంబర్‌లో క్రీడాకారులు, కోచ్‌లు, ప్రిన్సిపాళ్లను అభినందించారు. ప్రభుత్వం అందజేస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకుని విద్యార్థులు తమకు ఇష్టమైన క్రీడల్లో రాణించాలని సూచించారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిల్లో పతకాలు సాధించి ఐటీడీఏకు, తల్లిదండ్రులకు పేరు తేవాలన్నారు. రాష్ట్రస్థాయి పోటీల్లో భద్రాచలం జోన్ నుంచి 240 మంది క్రీడాకారులు పాల్గొనగా పది క్రీడాంశాలలో పతకాలు సాధించటం గర్వించదగిన విషయమని కొనియాడారు.
ఐటీడీఏ పీఓ రాహుల్


