ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించాలి
ములకలపల్లి/కొత్తగూడెంఅర్బన్/అశ్వారావుపేట రూరల్ : ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖాధికారి (డీఐఈఓ) వెంకటేశ్వరరావు అన్నారు. ములకలపల్లి, కొత్తగూడెం, అశ్వారావుపేట మండలాల్లోని పలు జూనియర్ కాలేజీల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను మంగళవారం ఆయన తనిఖీ చేశారు. ములకలపల్లి కళాశాలలో పరీక్షల నిర్వహణ, ప్రయోగశాలల ఏర్పాట్లు, విద్యార్థుల హాజరు నమోదు తదితర అంశాలను పరిశీలించారు. అనంతరం అశ్వారావుపేట మండలంలోని ఓ ప్రైవేట్ కళాశాలను తనిఖీ చేశారు. రెండో రోజు ఉదయం నిర్వహించిన ప్రాక్టికల్ పరీక్షకు సాధారణ విభాగానికి సంబంధించి 1,295 మందికి 1,263 మంది, ఒకేషనల్ విభాగంలో 1,386 మందికి 1,207 మంది హాజరయ్యారని వివరించారు. మధ్యాహ్నం నిర్వహించిన పరీక్షల్లో సాధారణ విభాగంలో 880 మందికి 861 మంది, వృత్తి విద్య కోర్సులో 1,365 మందికి 1,308 మంది హాజరయ్యారని వెల్లడించారు. పరీక్షలు పూర్తయ్యే వరకు అన్ని కేంద్రాల్లో నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని, విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకత, క్రమశిక్షణ పాటించాలని కళాశాల యాజమాన్యాలను ఆదేశించారు.
డీఐఈఓ వెంకటేశ్వరరావు


