పత్తాలేని పారితోషికం..
జిల్లాలో కుటుంబ సర్వే వివరాలు..
ఏడాదిగా ఎన్యూమరేటర్లకు
తప్పని నిరీక్షణ
సర్వే కోసం 4,372 మంది సేవలు
సిబ్బంది పారితోషికంపై
ఊసెత్తని ప్రభుత్వం
చుంచుపల్లి: రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు 2024 నవంబర్‌లో జిల్లావ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో భాగంగా సేవలందించిన ఎన్యూమరేటర్లు, సూపర్‌వైజర్లతో పాటు డేటా ఎంట్రీ ఆపరేటర్లు పారితోషికం కోసం ఏడాదిగా ఎదురుచూస్తున్నారు. సర్వేలో పాల్గొన్న ఎన్యూమరేటర్లు మరొకసారి అధికారులను కలుస్తూ తమ సమస్యను విన్నవిస్తున్నారు. ఈ సమగ్ర కుటుంబ సర్వే సందర్భంగా ఎన్యుమరేటర్లు అనేక ఇబ్బందులను ఎదుర్కొటూ విజయవంతం చేసిన విషయం తెలిసిందే. ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వే చేసి ఏడాది దాటినా నేటికీ వారికి అందాల్సిన గౌరవ వేతనం రాలేదు. దీంతో పారితోషికం అసలు వస్తుందా..రాదా అనే సందిగ్ధంలో పడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఇప్పటికీ ఊసెత్తకపోవడంతో కొంత ఆందోళన చెందుతున్నారు. సాధారణ ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లు పెంచడంతో పాటు ఇటు ప్రభుత్వ పరంగా అమలు చేసే సంక్షేమ పథకాలను పేదలకు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 2024 నవంబర్ 6 నుంచి 21 వరకు సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ కుల గణనను చేపట్టింది. జిల్లాలో నిర్వహించిన కుటుంబ సర్వేలో ప్రభుత్వ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు, అంగన్‌వాడీ టీచర్లు, మున్సిపల్ వార్డు అధికారులు, సెర్ప్ సిబ్బంది, ఎన్యుమరేటర్లు, సూపర్‌వైజర్లుగా పనిచేశారు. సర్వే సందర్భంగా ఒక్కొక్కరూ 120 నుంచి 150 వరకు కుటుంబాల చొప్పున ఎంచుకొని వివరాలు సేకరించారు. ఈ సర్వే అనంతరం నవంబర్ 22 నుంచి డిసెంబర్ 6 వరకు కుటుంబ వివరాలను డేటా ఎంట్రీ ఆపరేటర్లు రాత్రింబవళ్లు పనిచేసి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు.
జిల్లాలో 4,372 మంది సిబ్బంది సేవలు
జిల్లాలో నిర్వహించిన కుటుంబ సర్వేలో 2,383 మంది ఎన్యూమరేటర్లతో పాటు పర్యవేక్షణ కోసం మరో 236 మంది సూపర్‌వైజర్లు విధుల్లో పాల్గొన్నారు. సర్వేలో భాగంగా ఒక్కొక్క ఎన్యూమరేటర్ 150 కుటుంబాల చొప్పున వివరాలు సేకరించారు. జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో 103 వార్డులు, 481 గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 3,36,407 కుటుంబాల సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, ఉద్యోగ, రాజకీయ పరిస్థితులతో పాటు కులం వివరాలను నమోదు చేసుకున్నారు. ఒక్కో కుటుంబానికి 8 పేజీలతో కూడిన సర్వే ఫామ్‌లో 75 రకాల ప్రశ్నలుండగా, ఆయా కుటుంబ సభ్యుల నుంచి ఎన్యూమరేటర్లు ఓపిగ్గా వివరాలను రాబట్టారు. నేరుగా కుటుంబాల వద్దకు వెళ్లి చిరునామా, కుటుంబ సభ్యుల వివరాలు, కులం, రేషన్ కార్డు, ఆధార్‌కార్డు, వయస్సు, పశు సంపద, దివ్యాంగులు, వైవాహిక స్థితి, చదువు, ఫోన్ నంబర్, వృత్తి, ఉద్యోగం, స్వయం ఉపాధి, వ్యాపారం, కార్మికులు, వార్షిక ఆదాయం, ఆదాయ పన్ను చెల్లింపు, పట్టా భూమి, కౌలురైతు వివరాలు, రిజర్వేషన్ల ద్వారా పొందిన విద్య, ఉద్యోగ ప్రయోజనాలు, గత ఐదేళ్ల నుంచి పొందుతున్న ప్రభుత్వ పథకాల వివరాలను సేకరించారు. ఈ ఇంటింటి కుటుంబ సర్వేను జిల్లాలో కేవలం 20 రోజుల్లో పూర్తి చేశారు. అయితే సర్వేలో పాల్గొనే ఎన్యూమరేటర్లకు రూ.10 వేల చొప్పున, సూపర్ వైజర్లకు రూ.12 వేల చొప్పున చెల్లిస్తామని ప్రభుత్వం మొదట ప్రకటించింది. దీంతో పాటు కుటుంబాల వివరాలను ఆన్‌లైన్‌లో పొందుపర్చిన డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఒక్కో దరఖాస్తుకు రూ.7 చొప్పన చెల్లిస్తామని చెప్పింది. జిల్లాలోని 3,36,407 కుటుంబాల డేటా ఎంట్రీ కోసం 1,753 మంది ఆపరేటర్లు రాత్రింబవళ్లు పనిచేశారు. వీరందరీకీ కలిపి జిల్లాకు సుమారు రూ.3.60 కోట్ల మేర గౌరవ వేతనాన్ని ప్రభుత్వం విడుదల చేయాల్సి ఉంది. సర్వే పూర్తి కాగానే వెంటనే చెల్లిస్తామని చెప్పిన సర్కారు ఏడాది దాటినా ఇంతవరకు విడుదల చేయక పోవడంతో మరొకసారి ఎన్యూమరేటర్లు కార్యాలయాల చుట్టూ తిరుగుతూ అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.
సర్వే జరిగిన పంచాయతీలు : 481
4 మున్సిపాలిటీల పరిధిలో: 103 వార్డులు
సర్వే జరిపిన కుటుంబాలు: 3,36,407
సర్వేలో సేవలందించిన సిబ్బంది: 4,372
రావాల్సిన పారితోషికం: రూ.3.60 కోట్లు (సుమారు)


