అక్రమంగా తరలిస్తున్న కలప స్వాధీనం
కారేపల్లి: బొలేరో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న కలపను మండలంలోని బస్వాపురం వద్ద కారేపల్లి అటవీ శాఖ ఉద్యోగులు మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. భద్రాద్రి జిల్లా టేకులపల్లి నుంచి కారేపల్లి మండలం మీదుగా బొలేరో వాహనంలో కొందరు కలపను ఖమ్మం వైపు తరలిస్తుండగా స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. ఈ వాహనాన్ని కారేపల్లిలోని ఫారెస్టు రేంజ్ కార్యాలయానికి తరలించి విచారణ చేపడుతున్నారు. అయితే, వివరాలను గోప్యంగా ఉంచడం, మీడియాకు సమాచారం ఇవ్వకపోవడంతో అటవీ అధికారుల తీరుపై పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రెండు ఆటోలు ఢీ..
ఇల్లెందురూరల్: మండలంలోని సీఎస్పీబస్తీ రైల్వేగేటు వద్ద సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు. చల్లసముద్రం గ్రామంలో క్రీడా పోటీలకు హాజరైన క్రీడాకారులు ఆటోలో స్వగ్రామమైన జగదాంబగుంపు గ్రామానికి వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఇల్లెందుకు చెందిన ఆటో ఢీకొట్టింది. ప్రమాదంలో కుంజ పవన్, దిలీప్, దినేశ్, ఎట్టి సూరజ్, బుగ్గ సాయిచరణ్, ఇర్ప దీపక్ స్వల్పంగా గాయపడగా వారిని ఇల్లెందు ఆస్పత్రికి తరలించారు. కుంజ పవన్ ఫిర్యాదుపై మంగళవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ సురేశ్ తెలిపారు.


