మున్సిపోల్స్‌పై ఉత్కంఠ
ఓటరు జాబితాపై కసరత్తు
మున్సిపాలిటీల వారీగా ఓటర్ల వివరాలు
మణుగూరులో కోర్టు కేసుతో ఎన్నికలు జరగని పరిస్థితి
ఇల్లెందు, అశ్వారావుపేటల్లోనే సజావుగా ప్రక్రియ
సన్నద్ధమవుతున్న రాజకీయ పార్టీల నాయకులు
కార్పొరేషన్ కార్యాలయంలో పోలింగ్ స్టేషన్ల జాబితా సిద్ధం చేస్తున్న ఉద్యోగులు(ఫైల్)
ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం సన్నాహాలు చేస్తోంది. కార్పొరేషన్, మున్సిపల్ అధికారులు పది రోజులుగా ఎన్నికల ప్రక్రియలో నిమగ్నమయ్యారు. జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌లో ఎన్నికలపై సందిగ్ధం నెలకొనగా, మణుగూరులో కోర్టు కేసు కారణంగా ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. ఇక ఇల్లెందు, కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో మాత్రమే మున్సిపల్ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. –కొత్తగూడెంఅర్బన్
కోర్టుల్లో కేసులు..
కొత్తగూడెం కార్పొరేషన్‌లో విలీనమైన పాల్వంచ మున్సిపాలిటీలో రెండు దశాబ్దాలుగా ఎన్నికలు జరగడం లేదు. పాల్వంచ ఏజెన్సీ ప్రాంతంలో ఉందని కొందరు కోర్టులో కేసు వేయడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. పార్లమెంట్‌లో ప్రత్యేక చట్టం చేస్తే తప్ప అక్కడ ఎన్నికలు జరిగే పరిస్థితి లేదు. గతేడాది జూన్‌లో కొత్తగూడెం, పాల్వంచలను కలిపి కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌గా ఏర్పాటు చేశారు. అయితే విలీన ప్రక్రియ నిబంధనల ప్రకారం జరగలేదని కోర్టులో కేసు దాఖలైంది. దీంతో పాటు కొత్తగూడెంలోని మరికొందరు కూడా కేసులు దాఖలు చేశారు. ఇలా కోర్టుల్లో నాలుగు కేసులు నడుస్తుండటంతో ఈనెల 19, 21న తీర్పు వెలువడే అవకాశముంది. తీర్పు ఎలా వస్తుందోనని, ఎన్నికలు, జరుగుతాయా? జరగవా? అని ఆశావహుల్లో ఆందోళన మొదలైంది. మణుగూరు మున్సిపాలిటీ కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఉందని గతంలోనే కోర్టులో కేసులు దాఖలు చేశారు. దీంతో మణుగూరు మున్సిపాలిటీలో ఈ సారి కూడా ఎన్నికలు జరగవు. ఇల్లెందు మున్సిపాలిటీ, కొత్తగా ఏర్పడిన అశ్వారావుపేట మున్సిపాలిటీకి ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
రాజకీయ పార్టీల సన్నాహాలు
కొత్తగూడెం, ఇల్లెందు, అశ్వారావుపేటలలో రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై సన్నాహక సమావేశాలు నిర్వహిస్తున్నాయి. ఆయా ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రులు, ఎంపీలు పర్యటిస్తూ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలతోపాటు కేడర్‌కు దిశా నిర్దేశం చేస్తున్నారు. కార్పొరేషన్‌లో తొలిసారిగా ఎవరికి వారే తమ పార్టీ జెండాను ఎగురవేయాలనే భావనతో ఉన్నారు. ఆశావహులు గెలుపు సాధ్యాసాధ్యాలపై అంచనా వేసుకుంటూ, పార్టీలు మారుతున్నారు. కొందరు మాజీలు వార్డు, డివిజన్లలోని ఓటర్లను ఇప్పటి నుంచి మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు. కార్పొరేషన్ మేయర్ పీఠానికి గట్టి పోటీ ఉండే పరిస్థితి కనిపిస్తోంది. ఇక రిజర్వేషన్లపై కూడా ఆలోచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు.
జిల్లాలోని కొత్తగూడెం కార్పొరేషన్‌తోపాటు, ఇల్లెందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల్లో ఈ నెల 1వ తేదీ నుంచి ఎన్నికల సంబంధిత పనులు అధికారులు బిజీగా ఉన్నారు. ఇప్పటికే ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. మున్సిపాలిటీల్లో అందుబాటులో ఉంచారు. ఓటర్ల నుంచి అభ్యంతరాలను సైతం స్వీకరించారు. కానీ మార్పులు, చేర్పులు చేపట్టలేదు. ఈ నెల 12న ఫొటోతో కూడిన ఓటరు జాబితా విడుదల, 16వ తేదీ కల్లా తుది జాబితా, పోలింగ్ స్టేషన్ల జాబితా కూడా ప్రకటించనున్నారు. ప్రస్తుతం పోలింగ్ స్టేషన్ల వారీగా ఓటర్ల కేటాయింపు, వార్డు, డివిజన్ల రిజర్వేషన్లపై కసరత్తు జరుగుతోంది.
కొత్తగూడెం కార్పొరేషన్ తొలి ఎన్నిక సందిగ్ధమే
డివిజన్లు మొత్తం ఓటర్లు మహిళలు పురుషులు ఇతరులు
కొత్తగూడెం 60 1,35,123 70,503 64,590 30
ఇల్లెందు 24 33,777 17,523 16,250 4
అశ్వారావుపేట 22 16,850 8,762 8,084 4
మున్సిపోల్స్‌పై ఉత్కంఠ


