కబడ్డీ విజేత ‘రాజస్తాన్’
రెండో స్థానం దక్కించుకున్న ఉత్తరప్రదేశ్
మూడో స్థానంలో నిలిచిన తెలంగాణ జట్టు
ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
పినపాక: జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో రాజస్తాన్ జట్టు విజేతగా నిలిచింది. రెండో స్థానంలో ఉత్తరప్రదేశ్, మూడో స్థానంలో తెలంగాణ జట్లు నిలిచాయి. ఈ నెల 7 నుంచి మండలంలోని ఏడూళ్ల బయ్యారంలో నిర్వహిస్తున్న 69వ జాతీయస్థాయి అండర్ –17 కబడ్డీ పోటీలు ఆదివారం రాత్రి ముగిశాయి. ఫైనల్స్‌లో తలపడిన రాజస్తాన్ – ఉత్తరప్రదేశ్ జట్లు 28 పాయింట్లతో సమానంగా నిలవగా, ఎంపైర్లు ఇరుజట్లతో మాట్లాడి చెరో ఐదు రైడ్స్ కల్పించారు. ఉత్తరప్రదేశ్ జట్టు 5 రైడ్స్‌లో నాలుగు పాయింట్లు సాధించింది. రాజస్తాన్ జట్టు 6 పాయింట్లు సాధించి రెండు పాయింట్ల తేడాతో విజేతగా నిలిచింది. ఉత్తరప్రదేశ్ జట్టు రెండో స్థానం దక్కించుకుంది. అంతకుముందు మూడో స్థానం కోసం తెలంగాణ – హరియాణా జట్లు పోటీపడ్డాయి. అయితే ఈ పోటీ ప్రారంభం నుంచీ వివాదాస్పదంగానే సాగింది. ఇరు జట్లు హోరాహోరీగా తలబడి సమాన పాయింట్లు ఉన్న సమయంలో.. ఎంపైర్లు తెలంగాణ జట్టుకు సహకరిస్తున్నారని ఆరోపిస్తూ హరియాణా జుట్టు కోర్టు నుంచి నిష్క్రమించింది. దీంతో తెలంగాణ జట్టును విజేతగా ప్రకటించడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది.
క్రీడల నిర్వహణలో తలెత్తిన వివాదాలు
జాతీయ స్థాయి కబడ్డీ పోటీలు చివరి రోజు ఆదివారం వివాదాల మధ్య ముగిశాయి. రాజస్తాన్, కర్ణాటక, ఉత్తరప్రదేశ్ జట్లలో కొందరు అనర్హులు ఉన్నారని ఫిర్యాదులు అందగా, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అధికారులు, డీఎస్పీ వంగా రవీందర్ రెడ్డి, డీఈవో నాగలక్ష్మి విచారణ చేపట్టారు. వేలిముద్రలు, బరువు తదితర వివరాల ఆధారంగా కర్ణాటక, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ జట్లలో ఒక్కొక్కరు అనర్హులున్నట్లు గుర్తించారు. వారిని తొలగించి, తిరిగి పోటీలు నిర్వహించారు. సెమీఫైనల్‌లో హరియాణాపై రాజస్తాన్ విజయం సాధించింది. విజేతలకు పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, కలెక్టర్ జితేష్ వి పాటిల్, జాతీయ క్రీడల సమైక్య పరిశీలకుడు నిర్మల్ జాందే ట్రోఫీ, మెమెంటోలు, పతకాలు అందజేశారు. కార్యక్రమంలో డీఈఓ నాగలక్ష్మి, బీటీపీఎస్ సీఈ బుచ్చన్న, కంది చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ కంది విశ్వభారత్ రెడ్డి, మౌరీ టెక్ సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
కబడ్డీ విజేత ‘రాజస్తాన్’


