పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పాల్వంచరూరల్: పెద్దమ్మతల్లికి ఆదివారం అర్చకులు విశేష పూజలు నిర్వహించారు. మండలంలోని శ్రీకనకదుర్గ(పెద్దమ్మతల్లి) ఆలయానికి పొరుగు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. క్యూలైన్ ద్వారా భక్తులు అమ్మవారిని దర్శించుకోగా, అర్చకులు విశేష పూజలు జరిపారు. భక్తులు అన్నప్రాసనలు, ఒడిబియ్యం, పసుపు కుంకుమలు, చీరలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. పూజా కార్యక్రమంలో ఈఓ ఎన్.రజనీకుమారి, ఆలయ కమిటీ సభ్యులు, వేదపండితులు పద్మనాభశర్మ, అర్చకులు రవికుమార్‌శర్మ పాల్గొన్నారు.
నేడు ఉమ్మడి జిల్లాలో పొంగులేటి పర్యటన
ఖమ్మంమయూరిసెంటర్ : రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సోమవారం ఉమ్మడి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని సాయిప్రభాత్ నగర్‌లో పర్యటించనున్నారు. 2.15 గంటలకు భద్రాద్రి జిల్లా చండ్రుగొండ, 3.40 గంటలకు కొత్తగూడెంలో పర్యటిస్తారు. సాయంత్రం 5 గంటలకు డీసీసీ అధ్యక్షురాలు దేవీప్రసన్న ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొంటారు. 5.45 గంటలకు పాల్వంచ, 6.45 గంటలకు కొత్తగూడెంలో పర్యటిస్తారు. రాత్రి 9.30 గంటలకు కల్లూరు మండలం నారాయణపురంలోని తన నివాసానికి చేరుకుంటారు.
వడ్డే ఓబన్నకు నివాళి
సూపర్‌బజార్(కొత్తగూడెం): స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతిని ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించారు. జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించగా, కలెక్టర్ జితేష్ వి.పాటిల్ హాజరై ఓబన్న చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓబన్న జీవిత చరిత్ర భావితరాలకు స్ఫూర్తి దాయకమని అన్నారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డితో కలిసి ఆంగ్లేయులతో సాయుధపోరు సాగించాడని గుర్తుచేశారు. వడ్డెర సంఘం జిల్లా అధ్యక్షుడు పి.వెంకటేశ్వర్లు, బీసీ సంఘ నాయకులు టి.దుర్గారావు, బి.కనకరాజు, పి.శ్రావణ్‌కుమార్, కొదుమూరి సత్యనారాయణ, జిల్లా వెనుకబడిన తరగతుల శాఖాధికారి పి.విజయలక్ష్మి పాల్గొన్నారు.
విశ్వామిత్ర చౌహాన్‌కు అభినందన
చుంచుపల్లి: పర్యావరణ పరిరక్షణకు తనవంతుగా మొక్కలు నాటుతున్న చిన్నారి విశ్వామిత్ర చౌహాన్‌ను గుర్తించిన లండన్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో స్థానం కల్పించారు. ఇందుకు సంబంధించిన అవార్డును మాజీ ఉప రాష్ట్రపతిగా ఎం. వెంకయ్య నాయుడు ఆదివారం హైదరాబాద్‌లో అందించారు. అనంతరం చిన్నారితో కలిసి మొక్క నాటారు. ఈ కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి, త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి, సినీ హాస్యనటుడు పద్మశ్రీ బ్రహ్మానందం, ప్రవచన కిరీటి గరికపాటి నరసింహారావు పాల్గొన్నారు.
కిన్నెరసానిలో సండే సందడి
పాల్వంచరూరల్: పర్యాటక ప్రాంతమైన కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్, జలాశయం, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. 585 మంది పర్యాటకులు కిన్నెరసానిలోకి ప్రవేశించగా, వైల్డ్‌లైఫ్ శాఖకు రూ.30,355 ఆదాయం లభించింది. 270 మంది బోటుషికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.16,200 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.
పెద్దమ్మతల్లికి విశేషపూజలు
పెద్దమ్మతల్లికి విశేషపూజలు


