వైభవంగా కూడారై ఉత్సవం
భద్రాచలంటౌన్: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో ఆదివారం కూడారై ఉత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా 27వ రోజును పురస్కరించుకుని ఈ వేడుక జరిపారు. ఉత్సవంలో భాగంగా స్వామివారితోపాటు గోదాదేవి అమ్మవారిని ఆలయ ప్రాంగణంలోని బేడా మండపంలో కొలువుదీర్చారు. అర్చకులు ద్రావిడ ప్రబంధ పాశురాలను పఠిస్తూ, వేద మంత్రాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నెయ్యి, పాలు, చక్కెరతో ప్రత్యేకంగా తయారు చేసిన పాయసాన్ని స్వామివారికి నైవేద్యంగా సమర్పించారు. ఆదివారం కావడంతో ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు మార్మోగాయి. దేవస్థాన ఉన్నతాధికారులు, ప్రధాన అర్చకులు, వేద పండితులు ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
నేత్రపర్వంగా రామయ్య కల్యాణం
భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి నిత్య కల్యాణ వేడుక ఆదివారం నేత్రపర్వంగా సాగింది. తెల్లవారుజామున గర్భగుడిలో సుప్రభాత సేవ, సేవాకాలం, ఆరాధన, తదితర పూజలు చేశారు. అనంతరం స్వామివారిని మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. నిత్యకల్యాణ వేడుకలోనూ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
భారీగా హాజరైన భక్తులు


