
వ్యవసాయ కుటుంబం నుంచి 697వ ర్యాంకు
కల్లూరురూరల్: కల్లూరు మండలం వాచ్యానాయక్ తండాకు చెందిన గిరిజన యువకుడు బానోత్ నాగరాజు నాయక్ సివిల్స్ ఫలితాల్లో మెరిశాడు. ఆయన ఆల్‌ఇండియా స్థాయిలో 697వ ర్యాంక్ సాధించాడు. నాగరాజు నాయక్ ఒకటి నుంచి ఐదో తరగతి వరకు కల్లూరులో, 6నుంచి 10వ తరగతి వరకు పాలేరులోని నవోదయ విద్యాలయంలో చదవగా, ఇంటర్ విజయవాడ శ్రీ చైతన్య కళాశాల, బీటెక్ హైదరాబాద్‌లోని వీఎన్‌ఆర్ విజ్ఞాన జ్యోతి కళాశాలలో పూర్తిచేశారు. సివిల్స్‌లో సోషయాలజీ సబ్జెక్ట్ ఆప్షనల్‌గా తీసుకున్న నాగరాజు ఐదో ప్రయత్నంలో విజయం సాధించాడు. నాగరాజు తండ్రి పంతులు నాయక్ – తల్లి మారోని వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తూ ఇద్దరు కుమారులను చదివించారు. ప్రస్తుతం నాగరాజు సివిల్స్ సాధించగా.. ఆయన సోదరుడు హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం సివిల్స్ ప్రిలిమ్స్ దశ దాటిన వారికి ఇచ్చే రూ.లక్ష పారితోషికం అందుకున్న గిరిజన తండా వాసి నాగరాజు సివిల్స్‌కు ఎంపికవడంపై పలువురు అభినందించారు.