ఉప ఎన్నిక వస్తే బీఆర్‌ఎస్‌దే విజయం | - | Sakshi
Sakshi News home page

ఉప ఎన్నిక వస్తే బీఆర్‌ఎస్‌దే విజయం

Apr 22 2025 12:26 AM | Updated on Apr 22 2025 12:26 AM

ఉప ఎన

ఉప ఎన్నిక వస్తే బీఆర్‌ఎస్‌దే విజయం

భద్రాచలంఅర్బన్‌ : భద్రాచలం అసెంబ్లీకి ఉప ఎన్నిక వస్తే మళ్లీ గెలిచేది బీఆర్‌ఎస్‌ అభ్యర్థేనని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం స్థానిక హరిత హోటల్‌లో ఉద్యమకారులు, పార్టీ శ్రేణులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో ఆమె మాట్లాడారు. 2023 ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఒక్క భద్రాచలంలో మాత్రమే బీఆర్‌ఎస్‌ గెలిచిందని, 2014, 2018 ఎన్నికల్లోనూ ఉమ్మడి జిల్లాలో ఒక్కో సీటు మాత్రమే గెలుచుకున్నామని, అయినా కేసీఆర్‌ హయాంలో ఉమ్మడి జిల్లాకు భారీగా నిధులు కేటాయించారని గుర్తు చేశారు. సీతారామ ప్రాజెక్టును పూర్తి చేసి 3.50లక్షల ఎకరాలకు నీరందించారని తెలిపారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ముగ్గురు మంత్రులు ఉన్నా కొత్తగా వచ్చిన ప్రాజెక్టులు, ఆస్పత్రులు, హాస్టళ్లు ఏమీ లేవని, ఎమ్మెల్సీలుగా తాను, తాతా మధు చట్టసభల్లో అడుగుతున్న ప్రశ్నలకు డిప్యూటీ సీఎం భట్టి విక్కమార్క అన్నీ అబద్ధాలే చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్‌ హయాంలో అభివృద్ధే ధ్యేయంగా పని చేశారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో వరి పండుతోందంటే అది కేసీఆర్‌ చలువేనని చెప్పారు. కార్యకర్తల కష్టంతో భద్రాచలం ఎమ్మెల్యేగా గెలిచిన తెల్లం వెంకట్రావు ఆ తర్వాత అధికార పార్టీలోకి వెళ్లారని అన్నారు. ఈనెల 27న జరిగే బీఆర్‌ఎస్‌ రజతోత్సవ సభకు ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భారీ సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, పార్టీ భద్రాద్రి, ఖమ్మం జిల్లాల అధ్యక్షులు రేగా కాంతారావు, తాతా మధుసూదన్‌, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యేలు చంద్రావతి, హరిప్రియనాయక్‌, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ దిండిగాల రాజేందర్‌, నాయకులు మానె రామకృష్ణ, రావులపల్లి రాంప్రసాద్‌, ఆకోజు సునీల్‌ తదితరులు పాల్గొన్నారు.

రజతోత్సవ సభను విజయవంతం చేయండి

బూర్గంపాడు/పాల్వంచ/మణుగూరురూరల్‌ : ఈ నెల 27న ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్‌ఎస్‌ రజోతోత్సవ సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. సోమవారం ఆమె బూర్గంపాడు మండలం లక్ష్మీపురంలో మాజీ జెడ్పీటీసీ కామిరెడ్డి శ్రీలత నివాసంలో, మణుగూరులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. కాగా, భద్రాచలంలో మాజీ మంత్రి వనమా ఎమ్మెల్సీ కవితకు మెమెంటో అందజేశారు. ఆయా కార్యక్రమాల్లో వనమా రాఘవేందర్‌ రావు, కిలారు నాగేశ్వరరావు, బూర్గంపాడు పీఏసీఎస్‌ చైర్మన్‌ బిక్కసాని శ్రీనివాసరావు, నాయకులు పోశం నర్సింహరావు, వల్లూరిపల్లి వంశీకృష్ణ, జలగం జగదీశ్‌, గోనెల నాని, సిరిపురపు స్వప్న, భూక్యా శ్రావణి, ఎడ్ల శ్రీనివాస్‌, యాదగిరిగౌడ్‌, నూకారపు రమేష్‌, పాకాల రమాదేవి తదితరులు పాల్గొన్నారు. మణుగూరులో వపన్‌ నాయక్‌ ప్రతాప్‌ నివాసంలో తేనేటి విందు, ఎక్స్‌లెంట్‌ విద్యాసంస్థల చైర్మన్‌ యూసఫ్‌ షరీఫ్‌ ఏర్పాటు చేసిన భోజనాన్ని స్వీకరించారు.

పార్టీ శ్రేణుల సమావేశంలో ఎమ్మెల్సీ కవిత

మొదట రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు

ఉద్యమకారులను పట్టించుకోండి

‘భద్రాచలంలో మొదట బీఆర్‌ఎస్‌ కండువా కప్పుకున్నది మా నాన్న నరసింహమూర్తి. మా ఇంటికి కేసీఆర్‌, కవితమ్మ వచ్చారు, కానీ జిల్లా నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదు, మేం దళితులమనే చిన్న చూపు చూశారు. బీఆర్‌ఎస్‌ అధికారంలో ఉన్న పదేళ్లలో ఉద్యమకారులకు సముచిత స్థానం ఇవ్వలేదు. ఉమ్మడి జిల్లా నుంచి పార్టీలో చేరిన పలువురు ఎవరి వర్గానికి వారు పదవులు ఇప్పించుకున్నారు. దీంతో మొదటి నుంచి పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు రాలేదు. ఏదేమైనా మాకు కేసీఆరే నాయకుడు. ఇప్పుడున్న బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడికి నా పేరు కూడా తెలియదు’ అంటూ భద్రాచలానికి చెందిన రాజేంద్రవర్దన్‌ ఆవేదన వ్యక్తం చేశాడు.

రామాలయంలో ప్రత్యేక పూజలు

ఎమ్మెల్సీ కవిత మొదట భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఆమెకు ఆలయ అధికారులు, అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఈ క్రమంలో సీతారాములను దర్శించుకుని సీతమ్మవారికి సారె సమర్పించి గర్భగుడి నుంచి బయటకు వచ్చిన కవిత ‘రామలక్ష్మణ జానకి’ అంటూ జేజేలు పలికారు. అనంతరం లక్ష్మీతాయారమ్మ వారి సన్నిధిలో ఆమెకు పండితులు వేదాశీర్వచనం అందజేశారు.

ఉప ఎన్నిక వస్తే బీఆర్‌ఎస్‌దే విజయం1
1/1

ఉప ఎన్నిక వస్తే బీఆర్‌ఎస్‌దే విజయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement