
‘భూ భారతి’తో సత్వర పరిష్కారాలు
● సింగరేణి ఓసీ విస్తరణలో భూ సేకరణకు సహకరించాలి ● కలెక్టర్ జితేష్ వి.పాటిల్
మణుగూరు టౌన్/కరకగూడెం/పినపాక: భూ భారతి చట్టం రైతన్నలకు చుట్టంలా మారిందని, ఈ చట్టం ద్వారా రైతుల సమస్యలు సత్వరమే పరిష్కారమవుతాయని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. శుక్రవారం కరకగూడెం జెడ్పీ సెంటర్‌లో, పినపాక మండలం బయ్యారం క్రాస్‌రోడ్‌లో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూ భారతి చట్టంపై అవగాహన సదస్సులు నిర్వహించారు. సింగరేణికి భూసేకరణ కోసం మణుగూరు తహసీల్దార్ కార్యాలయంలో తిర్లాపురం, మణుగూరు రైతులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూ భారతి చట్టం సమన్యాయానికి సూచికగా నిలుస్తుందని, సాగు భూమికి రక్షణ కవచంలా ఉంటుందని అన్నారు. ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని ప్రభుత్వ బిల్డింగులకు, ప్రభుత్వ పాఠశాలలకు, అభివృద్ధి పనులకు కేటాయించడానికి ఉపయోగపడుతుందన్నారు. భూ హక్కుల రికార్డులలో తప్పుల సవరణకు అవకాశం ఉందని, రిజిస్ట్రేషన్, మ్యుటేషన్‌కు ముందు భూముల సర్వే, మ్యాప్ తయారీ ఉంటుందని వివరించారు. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులు కూడా పరిష్కారమవుతాయని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి రెండంచెల అప్పీలు వ్యవస్థ ఉంటుందన్నారు. మణుగూరు ఓసీ విస్తరణ కోసం భూ సేకరణకు నిర్వాసితులు సహకరించాలని కోరారు. నిర్వాసితుల విజ్ఞప్తి మేరకు తిర్లాపురంలో సేకరించే భూములకు పట్టణంలో మాదిరిగా ఎకరాకు రూ.22.5లక్షల వరకు చెల్లించేందుకు కృషి చేస్తామని, సింగరేణిలో ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు. అనంతరం రైతుల సందేహాలను నివృత్తి చేశారు. రైతులతోపాటు గిరిజన సంఘాల నాయకుల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. బయ్యారం క్రాస్‌రోడ్‌లో మునగపంటను పరిశీలించి, సాగు చేసిన రైతు కొప్పుల వర్మను అభినందించారు. ఎమ్మెల్యే పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుందని అన్నారు. ధరణి ద్వారా భూ సమస్యలు పరిష్కారం కావని, అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం భూ భారతి చట్టం తెచ్చిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో భద్రాచలం ఆర్డీఓ దామోదర్ రావు, ఏడీఏ తాతారావు, తహసీల్దార్లు రాఘవరెడ్డి, నాగ ప్రసాద్, నగేష్, ఎంపీడీఓలు కుమార్, సునీల్ కుమార్, ఎస్‌డీసీ సుమ, ఎంపీ ఓ వెంకటేశ్వరరావు, ఆర్‌ఐ కృష్ణ ప్రసాద్, తిర్లాపురం మాజీ సర్పంచ్ పాయం కామరాజు, పంచాయతీ కార్యదర్శులు సిబ్బంది పాల్గొన్నారు.
ఇళ్లకు పగుళ్లు వస్తున్నాయి..
సింగరేణిలో బ్లాస్టింగ్‌ల వల్ల ఇళ్ల గోడలకు పగుళ్లు వస్తున్నాయని మున్సిపాలిటీ పరిధిలోని పీకే–1, బాపనకుంట, రాజుపేట, విఠల్‌రావ్ నగర్‌ల గ్రామస్తులు కలెక్టర్‌కు విన్నవించారు. సింగరేణి కోసం భూములు ఇచ్చే రైతుల ఇళ్లు కూడా ఉన్నాయని, కేవలం 50 మీటర్ల దూరంలో ఉండటం వల్ల మా ఇళ్లు దెబ్బతింటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత దగ్గరగా బ్లాస్టింగ్ జరిగితే ఎలా నివసించాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఓసీ విస్తరణలో తమ నివాసాలు కూడా తీసుకుని, తమను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో విఠల్‌రావు నగర్, పీకే–1 సెంటర్ రైతులు, గ్రామస్తులు, సీపీఐ నాయకుడు దుర్గ్యాల సుధాకర్ పాల్గొన్నారు.

‘భూ భారతి’తో సత్వర పరిష్కారాలు