పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

Apr 9 2025 1:01 AM | Updated on Apr 9 2025 1:01 AM

పరీక్

పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

సూపర్‌బజార్‌(కొత్తగూడెం): ఈ నెల 20వ తేదీ నుంచి సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో జరిగే పది, ఇంటర్‌ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌ ఆదేశించారు. మంగళవారం తన చాంబర్‌లో అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పదో తరగతి విద్యార్థులు 720 మంది ఉండగా మూడు పరీక్ష కేంద్రాలు, 826 మంది ఇంటర్‌ విద్యార్థులకు గాను నాలుగు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారని, పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అభ్యర్థులు గంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని, మొబైల్‌ తదితర ఎలక్ట్రానిక్‌ వస్తువులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. సమావేశంలో డీఈఓ వెంకటేశ్వరాచారి, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘యువిక’కు దమ్మపేట గురుకులం విద్యార్థి

దమ్మపేట/నేలకొండపల్లి: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ నిర్వహిస్తున్న యువ విజ్ఞాని కార్యక్రమ్‌(యువిక)కు నేలకొండపల్లి మండలంలోని బైరవునిపల్లికి చెందిన విద్యార్థి బారి ఉదయ్‌ ఎంపికయ్యారు. గ్రామానికి చెందిన బారి వెంకన్న–సునీత దంపతుల కుమారుడు ఉదయ్‌ దమ్మపేటలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో తొమ్మిదో తరగతి చదువుతున్నాడు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ పాఠశాల విద్యార్థుల్లో శాస్త్ర, సాంకేతిక రంగాల్లో ఆసక్తి పెంచేందుకు ‘యువిక’ కార్యక్రమం నిర్వహిస్తుండగా 15రోజుల శిక్షణకు ఆయన ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా ఉదయ్‌ను జెడ్పీ మాజీ వైస్‌ చైర్మన్‌ ఎం.ధనలక్ష్మి, గ్రామస్తులుపోలంపల్లి నాగేశ్వరరావు, మరికంటి ఉమ తదితరులు అభినందించారు.

ఆఫ్‌టైప్‌ మొక్కలకు

నష్టపరిహారం ఇవ్వాలి

అశ్వారావుపేటరూరల్‌: ఆఫ్‌టైప్‌ మొక్కలతో తీవ్రంగా నష్టపోయిన పామాయిల్‌ రైతులకు నష్టపరిహారం చెల్లించాలని తెలంగాణ ఆయిల్‌పాం రైతు సంఘం రాష్ట్ర కన్వీనర్‌ కొక్కెరపాటి పుల్లయ్య డిమాండ్‌ చేశారు. మండలంలోని నారంవారిగూడెంలోని ఆయిల్‌ఫెడ్‌ డివిజనల్‌ కార్యాలయం వద్ద రైతులు మంగళవారం ధర్నా చేయగా.. ఆయన మాట్లాడారు. ఆయిల్‌ఫెడ్‌ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రైతులకు అందించిన ఆఫ్‌టైప్‌ మొక్కలతో తీరని నష్టం వాటిల్లిందని, బాధిత రైతులను గుర్తించి తక్షణమే నష్ట పరిహారం అందించాలని కోరారు. అశ్వారావుపేట, అప్పారావుపేట పామాయిల్‌ ఫ్యాక్టరీల పరిధిలో ఆయిల్‌ రిఫైనరీ యూనిట్‌, ఐఐఓపీఆర్‌ పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఆయిల్‌ఫెడ్‌ డివిజనల్‌ అధికారి నాయుడు రాధాకృష్ణకు వినతిపత్రం అందించారు. కార్యక్రమంలో సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు యలమంచిలి వంశీకృష్ణ, అన్నవరపు సత్యనారాయణ, రైతులు తుంబూరు మహేశ్వరరెడ్డి, తలసీల ప్రసాద్‌, కారం శ్రీరాములు, ఆళ్ల నాగేశ్వరరావు పాల్గొన్నారు.

నేడు వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతుల కౌన్సెలింగ్‌

ఖమ్మంవ్యవసాయం: పశు సంవర్ధక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్లకు పదోన్నతి కల్పించేందుకు బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. జోన్‌–1 నుంచి జోన్‌–7 వరకు 373 మంది వెటర్నరీ అసిస్టెంట్ల(పశువైద్య సహాయకులు)లో అర్హులకు లైవ్‌ స్టాక్‌ అసిస్టెంట్లు(పశుసంపద సహాయకులు)గా పదోన్నతి కల్పిస్తారు. జోన్‌–4లోకి వచ్చే హన్మకొండ, వరంగల్‌, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్‌ జిల్లాల నుంచి 46 మంది అర్హత సాధించగా, బుధవారం కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు. ఖమ్మం జిల్లాకు సంబంధించి కౌన్సెలింగ్‌లో జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ కె.వెంకటనారాయణతో పాటు మరో అసిస్టెంట్‌ డైరెక్టర్‌, కార్యాలయ మేనేజర్‌ పాల్గొని, రోస్టర్‌ ఆధారంగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేస్తారు.

బొలేరో వాహనం బోల్తా

చర్ల: మండలంలోని దండుపేటలో మంగళవారం రాత్రి మిర్చి లోడుతో వెళ్తున్న బొలేరో వాహనం బోల్తా పడింది. చర్లకు చెందిన టీఎస్‌28 టీఏ 1573 నంబర్‌ గల బొలేరో వాహనం కొత్తపల్లి నుంచి మిర్చి లోడుతో గుంటూరుకు బయలుదేరింది. దండుపేట మూలమలుపు వద్ద అదుపుతప్పి ప్రధాన రహదారిపై బోల్తా పడింది. డ్రైవర్‌ సురక్షితంగా బయటపడ్డాడు.

పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి 1
1/1

పరీక్షలకు ఏర్పాట్లు చేయాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement