● మృతుడు ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వాసి
టేకులపల్లి: మండలంలోని కారుకొండ క్రాస్ రోడ్డు సమీపంలో ఓ వ్యక్తి గుండెపోటుతో మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ పోగుల సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం ఖమ్మం పాడుకు చెందిన బండి రామకృష్ణ(48) గురువారం కారుకొండ క్రాస్ రోడ్ వద్ద గల జామాయిల్ యార్డ్ వద్దకు వచ్చి నీళ్లు తాగాడు. అక్కడే చాప వేసుకుని కాసేపు నిద్రపోయాడు. ఆ తర్వాత ఒక్కసారిగా లేచి ‘నాకు ఊపిరి ఆడడం లేద’ంటూ అరుస్తూ కింద పడిపోయాడు. స్థానికులు ఎంత ప్రయత్నం చేసినా స్పందించకపోవడంతో 108కు సమాచారం అందించారు. అంబులెన్స్ సిబ్బంది అతడిని పరీక్షించి మృతిచెందాడని నిర్ధారించారు. అతడి వద్ద ఉన్న మొబైల్ ఆధారంగా వివరాలు తెలుసుకున్నారు. మృతుడి వెంట ట్యాబ్లెట్లు, బట్టలు ఉన్నాయని, మృతదేహాన్ని కొత్తగూడెం ఏరియా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించామని ఎస్‌ఐ తెలిపారు.


