తొలి మేయర్ ఎస్టీలకే
ఎస్టీ జనరల్ కేటగిరీలో
కొత్తగూడెం కార్పొరేషన్
అశ్వారావుపేటలో
జనరల్ మహిళకు అవకాశం
జిల్లా కేంద్రమైన కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్‌కు తొలి మేయర్‌గా పని చేసే అవకాశం ఎస్టీ సామాజిక వర్గానికి దక్కింది. అలాగే, అశ్వారావుపేట మున్సిపల్ పాలక వర్గానికి నాయకత్వం వహించే బాధ్యత జనరల్ కేటగిరీ మహిళకు దక్కింది. త్వరలో జరగబోయే పురపాలక సంస్థల ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించిన ప్రకటన శనివారం వెలువడింది. – సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
గూడెంలో ఎస్టీలే అధికం..
రాష్ట్రంలో మొత్తం పది కార్పొరేషన్లకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఇందులో రిజర్వేషన్ల వారీగా ఎస్టీలకు 1, ఎస్సీలకు 1, బీసీలకు 3 స్థానాలు దక్కా యి. దీంతో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు ఏ కార్పొరేషన్లకు వెళ్తాయనే ఆసక్తి నెలకొంది. శనివారం ప్రకటించిన రిజర్వేషన్లలో కొత్తగూడెం నగర పాలక సంస్థ ఎస్టీలకు రిజర్వయింది. కొత్తగూడెం కార్పొరేషన్ ఓటర్లు 1.34 లక్షల మంది ఉండగా అందులో అత్యధికంగా ఎస్టీ ఓటర్లు 33 వేల మంది వరకు ఉన్నారు. ఎస్సీ ఓటర్ల సంఖ్య 30 వేలకు పైగా ఉంది. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్ ఎస్టీ జనరల్ కేటగిరీలోకి వెళ్లగా సింగరేణి ప్రాంతమైన రామగుండం కార్పొరేషన్ ఎస్సీ కేటగిరీలోకి వెళ్లింది.
ఇల్లెందు బీసీలకు..
రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 38 పురపాలికలు కేటా యించగా అందులో యాభై శాతంగా 18 మహిళలకు ఉన్నాయి. అందులో ఒక స్థానంగా ఇల్లెందు నిలిచింది. ఉమ్మడి జిల్లాలోనే ఎటువంటి చట్టపరమైన చిక్కులు లేకుండా మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్న పురపాలికలుగా ఖమ్మం, ఇల్లెందులు ఉన్నాయి. ఖమ్మం తర్వాత మున్సిపాలిటీగా సీని యారిటీ ఉన్నది ఇల్లెందుకే. ఈ మున్సిపాలిటీకి నలభై ఏళ్లుగా ఎన్నికలు జరుగుతున్నాయి. రొటేషన్ క్రమంలో ఇక్కడ రిజర్వేషన్లు మారుతూ వస్తున్నాయి. ప్రస్తుతం జరగబోయే ఎన్నికల్లో ఈ స్థానం బీసీ మహిళకు దక్కింది. అంతకు ముందు ఓసీ జనరల్, బీసీ మహిళ, ఎస్సీ, ఎస్టీలకు ఇక్కడ అవకాశం దక్కింది. ఇల్లెందు మున్సిపాలిటీలో ఓటర్ల సంఖ్య 33,723గా ఉంది. ఇందులో బీసీ ఓటర్ల సంఖ్య 20,428గా ఉండటం కూడా ఈ స్థానం బీసీ కోటాలోకి వెళ్లడానికి ఉపకరించింది. బీసీల తర్వాత ఎస్సీ ఓటర్లు 6,028, ఎస్టీ ఓటర్లు 2,433, ఇతరులు 2,889 మంది ఉన్నారు.
గిరిజనేతరులకు
అవకాశం
పూర్తిగా ఏజెన్సీలో ఉన్న అశ్వారావుపేట మున్సిపాలిటీకి తొలిసారిగా జరుగుతున్న ఎన్నికల్లో చైర్మన్ పీఠంపై కూర్చునే అవకాశం జనరల్ మహిళకు దక్కింది. ఇక్కడ 16 వేల మంది ఓటర్లు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 121 మున్సిపాలిటీలు ఉండగా అందులో జనరల్ మహిళలకు 31 స్థానాలు కేటాయించాల్సి ఉంది. ఈ క్రమంలో అశ్వారావుపేట జనరల్ మహిళ కేటగిరీలోకి వెళ్లింది. అశ్వారావుపేట అసెంబ్లీ స్థానం ఎస్టీలకు రిజర్వ్ కావడంతో ఇక్కడ అన్ని ప్రధాన పార్టీల్లోని గిరిజనేతర నాయకులు పాలన పగ్గాలు అందుకునేందుకు మరో అవకాశం కోసం చాన్నాళ్లుగా ఎదురు చూస్తున్నారు. తొలిసారి జరిగే ‘పేట’పురపోరులో తమకు అవకాశం లభిస్తుందా లేదా అనే సందేహాలు వారిని వెంటాడాయి. అన్ని అనుమానాలను పటాపంచలు చేస్తూ ఈ స్థానం జనరల్ కేటగిరీలోకి వెళ్లింది. జనరల్ మహిళ కావడంతో ఇప్పుడు అభ్యర్థి ఎంపిక అంశంపై అన్ని ప్రధాన పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి.


