సీఎంతో రామాలయ పనులకు శంకుస్థాపన
అశ్వారావుపేట: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా శ్రీరామనవమి రోజు భద్రాచలం రామాలయ విస్తరణ పనులకు శంకుస్థాపన చేయించనున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. శనివారం ఆయన అశ్వారావుపేట మండలం గంగారంలోని తన వ్యవసాయ క్షేత్రంలో మీడియాతో మాట్లాడారు. రైతు కేంద్రంగా ప్రభు త్వ పరిశోధనలు జరగాలని ఆకాంక్షించారు. విచ్చలవిడిగా ఎరువులు, పురుగుమందులు వాడటం వల్ల కాలుష్యం పెరిగిపోతోందని పేర్కొన్నారు. కాలుష్య నివారణకు సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని చెప్పారు. ఉమ్మడి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు, రహదారులు యజ్ఞంలా చేపట్టే అదృష్టం తనకు లభించిందని తెలిపారు.
●దమ్మపేట అభివృద్ధికి సహకారం
దమ్మపేట: మండల కేంద్రమైన దమ్మపేట అభివృద్ధికి సహకారం అందిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను మంజూరు చేయించాలని కోరుతూ బీఆర్‌ఎస్ నాయకుడు, జిల్లా రైతు సమన్వయ సమితి మాజీ సభ్యుడు దారా యుగంధర్, ఆయన అనుచరులు, వార్డు సభ్యులు కలిసి మంత్రికి వినతి పత్రం అందజేశా రు. శనివారం మండల పరిధిలోని గండుగులపల్లి లో ఉన్న మంత్రి తుమ్మల నివాసంలో కలిసి శాలు వాతో సత్కరించారు. ఈ సందర్భంగా యుగంధర్ మాట్లాడుతూ దమ్మపేటకు అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కాలేజీ, జూనియర్ కళాశాల, పామాయిల్ రైతులకు అవసరమైన యూనియన్ బ్యాంక్, శిథిలావస్థలో ఉన్న బస్టాండ్ స్థానంలో నూతన బస్టాండ్ భవనం, పామాయిల్ ఫ్యాక్టరీ మార్గంలో సెంట్రల్ లైటింగ్ మంజూరు చేయాలని అన్నారు. దీంతో స్పందించిన మంత్రి దమ్మపేట అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. నాయకులు దారా రాము, పాకనాటి శ్రీను, ఉయ్యాల లక్ష్మీనారాయణ, రామభద్రం, చిన్నశెట్టి మధు, కె.వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు


