● ఇకపై పూర్వ వీఆర్‌ఏలు, వీఆర్వోలకు మంచి రోజులు ● ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి
ఖమ్మం సహకారనగర్: ఎన్నో చారిత్రక పోరాటాలు, జాతీయ స్థాయి ఉద్యమాలకు పురుడు పోసుకున్న ఖమ్మం వేదికగా తెలంగాణ ఉద్యోగ జేఏసీ ఆత్మీయ సమ్మేళనాలను ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలంగాణ రాష్ట్ర ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి తెలిపారు. ఖమ్మంలో శుక్రవారం నిర్వహించిన ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల స్థాయి రెవెన్యూ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు, సీఎస్ సహకారంతో అనేక విజయాలు సొంతమయ్యాయని చెప్పారు. సెలక్షన్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల సాధన, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ల పోస్టుల సంఖ్య పెంపు, గ్రామానికో అధికారి నియామకం సహా పూర్వ వీఆర్‌ఏ, వీఆర్వోలను మాతృశాఖలోకి తీసుకోవడం వంటి విజయాలు సాధించామని తెలిపారు. ఇదే స్ఫూర్తితో మిగతా సమస్యలను కూడా ప్రభుత్వ సహకారంతో పరిష్కరించుకుంటామని చెప్పారు. ఈసమావేశంలో డిప్యూటీ కలెక్టర్ల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణ, టీజీటీఏ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.రాములు, పాక రమేష్‌తో పాటు వివిధ సంఘాల బాధ్యులు పూల్‌సింగ్ చౌహన్, నరసింహారావు మంగీలాల్, తూమాటి శ్రీనివాస్, కోట రవికుమార్, అశోక్‌కుమార్, భద్రునాయక్, గుండు రాజు, జాదవ్ మాణిక్యరావు, ప్రతాప్, అభిరామ్, మురళి, బాణాల రాంరెడ్డి, వి.భిక్షం, గరికె ఉపేందర్‌రావు తదితరులు పాల్గొన్నారు.