జిల్లాకు ఊరట.. | - | Sakshi
Sakshi News home page

జిల్లాకు ఊరట..

Published Thu, Mar 20 2025 12:21 AM | Last Updated on Thu, Mar 20 2025 12:22 AM

కొత్తగూడెం కార్పొరేషన్‌కు బడ్జెట్‌లో నిధులు
● సీతారామ ప్రాజెక్టుకూ భారీగానే కేటాయింపు ● పల్లెలు, గిరిజన గూడేలకు రోడ్డు సౌకర్యం ● జిల్లాలో టూరిజం, వ్యవసాయ అనుబంధ రంగాలకు ఊతం ● ‘భద్రాద్రి’, ఇంజనీరింగ్‌ కాలేజీకి మాత్రం మొండిచేయే..

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: త్వరలో ఏర్పాటుకాబోయే కొత్తగూడెం కార్పొరేషన్‌కు ప్రస్తుత బడ్జెట్‌లో చోటు దక్కింది. కొత్తగూడెం, పాల్వంచ మున్సిపాలిటీలతో పాటు సుజాతనగర్‌ మండలంలోని ఏడు గ్రామపంచాయతీలను కలిపి కొత్తగూడెం కార్పొరేషన్‌ ఏర్పాటుకు సంబంధించిన బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టగా.. ఈ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయ్యేలోగా ఆమోదం రావడంతో పాటు గవర్నర్‌ సంతకం చేసి గెజిట్‌ వచ్చే అవకాశం ఉందని కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీనికి బలం చేకూర్చేలా కొత్తగూడెం – పాల్వంచ కార్పొరేషన్‌కు నగరాభివృద్ధి పద్దులో ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నట్టు బడ్జెట్‌లో పలుమార్లు పేర్కొన్నారు. ఇటీవల కార్పొరేషన్లుగా అప్‌గ్రేడ్‌ అయిన మంచిర్యాల, మహబూబ్‌నగర్‌తో పాటు కొత్తగూడేనికి వివిధ పద్దుల కింద రమారమీ రూ.1,000 కోట్ల నిధులు కేటాయించారు. దీంతో కొత్తగూడెం కార్పొరేషన్‌కు పెద్దపీట వేసినట్టయింది. కాగా, ఓఎన్‌జీసీ, సింగరేణి భాగస్వామ్యంలో మణుగూరు మండలం పగిడేరు వద్ద జియో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ నిర్మిస్తామని భట్టి వెల్లడించారు.

సాగునీటి రంగానికీ ఊతం..

2025 – 26 రాష్ట్ర బడ్జెట్‌లో సీతారామ ప్రాజెక్టుకు రెండు పద్దుల కింద వరుసగా రూ.643 కోట్లు, రూ. 56 కోట్లు కేటాయించారు. తొమ్మిదేళ్ల క్రితం ఈ ప్రాజెక్టు పనులు చేపట్టి రూ.10వేల కోట్లకు పైగా ఖర్చు చేసినా ఇప్పటికీ ఒక్క ఎకరాకు నీరు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఈ నెల ఆరంభంలో తొలిసారిగా గోదావరి నీళ్లు ఎన్నెస్పీ కెనాల్‌కు చేరుకోవడం సానుకూల అంశం. ఇదే తీరుగా ప్రాజెక్టు పనులు ముందుకు సాగి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ప్రాజెక్టులకు నీరు మళ్లించేందుకు ప్రస్తుత కేటాయింపులు దోహదపడనున్నాయి. ఇక మధ్య తరహా ప్రాజెక్టుల్లో పెదవాగుకు రూ.46 కోట్లు, తాలిపేరుకు రూ.7.30 కోట్లు కేటాయించడం గమనార్హం.

రైస్‌ మిల్లులు రాబోతున్నాయి..

జిల్లాలో రైస్‌ మిల్లుల కొరత తీవ్రంగా ఉంది. ఇక్కడ పండించిన ధాన్యాన్ని మిల్లింగ్‌ కోసం ఇతర జిల్లాలకు తరలించాల్సి వస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో ప్రతీ మండలంలో మహిళా రైస్‌ మిల్లులు ఏర్పాటు చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు. ప్రస్తుతం ఐకేపీల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యాన్ని ఈ రైస్‌ మిల్లులకు తరలిస్తామని, ఇక్కడి నుంచే ఎఫ్‌సీఐకి ఆ ధాన్యాన్ని విక్రయిస్తామని తెలిపారు. మరోవైపు ప్రజా రవాణాతో పాటు సరుకు రవాణా కోసం ఆర్టీసీ బస్సులను మండల సమాఖ్యలకు ఇవ్వనున్నారు. ఇప్పటికే జిల్లాలోని డిపోలకు బస్సులు చేరుకున్నాయి. దీనికి తోడు మండలాల్లో మినీ గోడౌన్లు నిర్మిస్తామన్నారు. ఈ గోడౌన్లు, వాటి ప్రాంగణాలు సైతం రైతులకు ఉపయోగకరం కానున్నాయి.

టూరిజానికి ఊతం..

రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన టూరిజం పాలసీలో జిల్లా చోటు దక్కించుకుంది. కిన్నెరసాని దగ్గర అంతర్జాతీయ స్థాయిలో ఎకో టూరిజం అభివృద్ధి చేసేందుకు కన్సల్టెంట్‌ను నియమిస్తామని డిప్యూటీ సీఎం ఇప్పటికే ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్‌ ద్వారా జిల్లాలో పర్యాటక రంగానికి రూ.775 కోట్లు ప్రకటించడంతో టూరిజం పరంగా సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉంది.

పల్లెలకు బాటలు..

జిల్లాలో ప్రతీ పంచాయతీకి బీటీ రోడ్డు సౌకర్యం కల్పించాలని ఈ బడ్జెట్‌లో నిర్ణయించారు. అడవుల్లోనే నివాసం ఉండే పీవీటీజీ ఆవాసాలకు సైతం సీసీ రోడ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. జిల్లాలోని దమ్మపేట మండలంలో కాలిబాట ఉన్న పూసుగూడెం పరిసర గ్రామాలకు పక్కా రోడ్డు రానుంది. అలాగే రాష్ట్రంలోని మూడు ఐటీడీఏల పరిధిలోని మండలాల్లో రోడ్ల నిర్మాణాలకు రూ.450 కోట్ల కేటాయించగా.. ఈ మూడు ఐటీడీఏల్లో భద్రాచలమే పెద్దదిగా ఉంది.

మావోయిస్టు ప్రభావిత నిధులు..

మావోయిస్టు ప్రభావిత ప్రాంతంగా ఉన్న ఈ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించింది. దీనికి అదనంగా కేంద్ర పద్దు కింద రూ.82 కోట్ల కేటాయింపులు చూపారు. ఇందులో లొంగిపోయిన మావోయిస్టులకు రూ.20కోట్లు ఉండగా మిగిలినవి ఇన్‌ఫర్మేషన్‌, సెక్యూరిటీ, ఎస్టాబ్లిష్‌మెంట్‌ తదితర అవసరాల కోసం వెచ్చించనున్నారు.

భరద్రగిరికి నిరాశే

రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలైన యాదగిరిగుట్టకు రూ.200 కోట్లు, వేములవాడ టెంపుల్‌ అథారిటీకి రూ.100 కోట్లు ఈ బడ్జెట్‌లో కేటాయించారు. అయితే భద్రాచలం క్షేత్రానికి మాత్రం మళ్లీ నిరాశే ఎదురైంది. గత పదకొండేళ్లుగా ప్రతీ బడ్జెట్‌లో భద్రాచలం ఆలయానికి ప్రత్యేక నిధుల కేటాయింపు అనేది ఎండమావిగానే నిలుస్తోంది. సాంకేతిక విద్య విషయానికి వస్తే కొత్తగూడెంలో ఉన్న ప్రభుత్వ ఇంజనీరింగ్‌ కాలేజీలో కొత్త భవనాలు, ల్యాబ్‌లు, పరికరాల కోసం రూ.75 కోట్లు కేటాయించాలని 2023లో ప్రతిపాదనలు పంపినా ఇప్పటికీ మోక్షం రాలేదు. అయితే జేఎన్‌టీయూ, పాలేరుకు రూ.50 కోట్ల కేటాయింపు ఊరటనిచ్చే అంశంగా మిగిలింది.

జిల్లాకు ఊరట..1
1/3

జిల్లాకు ఊరట..

జిల్లాకు ఊరట..2
2/3

జిల్లాకు ఊరట..

జిల్లాకు ఊరట..3
3/3

జిల్లాకు ఊరట..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement