అన్నపురెడ్డిపల్లి (చండ్రుగొండ) : అన్నపురెడ్డిపల్లిలో వేంచేసి ఉన్న శ్రీ బాలాజీ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా యజ్ఙాచార్యులు ప్రతాపురం గిరిధరాచార్యులు ఆధ్వర్యంలో ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు స్వామివారికి మహాపూర్ణాహుతి, బలిహరణం, చక్రస్నానం, ద్వజావరోహణం తదితర కార్యక్రమాలు నిర్వహించారు. స్వామివారికి శృంగార డోలోత్సవంతో వేడుకలు ముగిసినట్లు అర్చకులు ప్రకటించారు. ఆలయ ఇన్‌చార్జ్ మేనేజర్ పాకాల వెంకటరమణ పాల్గొన్నారు.
రామాలయంలో
సుదర్శన హోమం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో సోమవారం చిత్తా నక్షత్రం సందర్భంగా సుదర్శన హోమం చేశారు. అలాగే స్వామివారి మూలమూర్తులను ముత్తంగి రూపంలో అలంకరించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం బేడా మండపంలో కొలువుదీర్చి విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం చేశారు. స్వామి వారికి కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణ, యోక్త్రధారణ గావించి నిత్యకల్యాణ ఘట్టాన్ని అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
గిరిజనులు
ఆర్థికాభివృద్ధి సాధించాలి
భద్రాచలం: ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలతో గిరిజనులు ఆర్థికాభివృద్ధి సాధించాలని ఐటీడీఏ ఏపీఓ జనరల్ డేవిడ్‌రాజ్ అన్నారు. ఐటీడీఏలోని సమావేశ మందిరంలో సోమవారం జరిగిన గిరిజన దర్బార్‌లో దరఖాస్తులను స్వీకరించిన ఆయన మాట్లాడుతూ.. ఇక్కడ వినతిపత్రాలు సమర్పించే వారందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రతి దరఖాస్తును నమోదు చేసి ఆర్హతల మేరకు సత్వరమే పరిష్కరించాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్‌డీసీ రవీంద్రనాథ్, గురుకులాల ఆర్‌సీఓ నాగార్జున రావు, ట్రైబల్ వెల్ఫేర్ ఈఈ చంద్రశేఖర్, ఎస్‌ఓ భాస్కర్, మణిధర్, ఉదయ్‌కుమార్, ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా
అధ్యక్షుడిగా ‘బైరెడ్డి’
చుంచుపల్లి: భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బైరెడ్డి ప్రభాకర్ రెడ్డిని నియమిస్తూ రాష్ట్ర నాయకత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాల విభజనకు ముందు కూడా ఆయన జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు. విభజన తర్వాత 2017 నుంచి 2020 వరకు భద్రాద్రి జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. అనంతరం ములుగు, మహబూబాబాద్ జిల్లాల అధ్యక్షుడిగా కూడా కొంతకాలం పనిచేశారు. తిరిగి రెండో సారి ప్రభాకర్‌రెడ్డిని జిల్లా అధ్యక్షుడిగా పార్టీ అధిష్టానం నియమించింది. ఆయన నియామకం పట్ల పలువురు నాయకులు హర్షం వ్యక్తం చేశారు.
స్టాఫ్ నర్సులకు
నియామక పత్రాలు..
కొత్తగూడెంఅర్బన్: గతేడాది జనవరిలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి కార్యాలయం నుంచి విడుదలైన నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 31 మంది స్టాఫ్ నర్సులకు, 33 మంది ఎంఎల్‌హెచ్‌పీ అభ్యర్థులకు సోమవారం నియామక పత్రాలు అందించారు. డీఎంహెచ్‌ఓ కార్యాలయంలో ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం కౌన్సెలింగ్ నిర్వహించి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ భాస్కర్‌నాయక్ మాట్లాడుతూ విధుల పట్ల అంకితభావంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అధికారులు బాలాజీ, సుదర్శన్, సిబ్బంది చిన్నోజీ, ధనుజా తదితరులు పాల్గొన్నారు.
ముగిసిన బాలాజీ బ్రహ్మోత్సవాలు
ముగిసిన బాలాజీ బ్రహ్మోత్సవాలు