
పోలింగ్ పారదర్శకంగా నిర్వహించాలి
జిల్లా ఎన్నికల అధికారి
డాక్టర్ ప్రియాంక ఆల
సూపర్‌బజార్(కొత్తగూడెం): శాసనమండలి నల్లగొండ–వరంగల్–ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గ ఉప ఎన్నికను పాదర్శకంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ ప్రియాంక ఆల సూచించారు. ఎన్నికల సిబ్బందికి సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆమె మాట్లాడారు. ఈ నెల 27న పోలింగ్ జరగనుందని, అధికారులు ఎన్నికల ప్రక్రియ, ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. 26న శ్రీరామచంద్ర ఆర్ట్స్ కళాశాలలో డిస్ట్రిబ్యూషన్ సెంటర్ ఏర్పాటు చేస్తామని, 27న రిసెప్షన్ కూడా అక్కడే ఉంటుందని వివరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆర్డర్ ఆఫ్ ప్రియారిటీ ప్రకారం నంబరు ద్వారా ఓటు వేయాలని, పోలింగ్ స్టేషన్లలో ఇచ్చిన వైలెట్ కలర్ స్కెచ్‌పెన్ మాత్రమే వాడాలని, ఇంకా ఏవిధమైన నంబర్లు, పేరు, సిగ్నేచర్ రాయవద్దని సూచించారు. బ్యాలెట్ పేపర్‌ను ముందు నిలువుగా, తర్వాత అడ్డంగా మలిచి బ్యాలెట్ బాక్స్‌లో వేయాలని తెలిపారు. ఎన్నికల సిబ్బంది పోస్టల్ బ్యాలెట్‌ను సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఫామ్–12 ద్వారా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన ఓటరు పెసిలిటేషన్ సెంటర్‌లో ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ సుమ, ఎన్నికల సూపరింటెండెంట్ దారా ప్రసాద్, ట్రైనింగ్ నోడల్ అధికారి అలీం, డీఎల్‌ఎంటీ పూసపాటి సాయికృష్ణ, కిరణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.