పోలింగ్‌ శాతంలో రిగ్గింగ్‌ గుట్టు | - | Sakshi
Sakshi News home page

పోలింగ్‌ శాతంలో రిగ్గింగ్‌ గుట్టు

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

పోలింగ్‌ శాతంలో రిగ్గింగ్‌ గుట్టు

ఎస్‌ఐఆర్‌ లెక్కల ప్రకారం 88 శాతం పోలింగ్‌ 70.02 శాతమే నమోదైనట్టు మాయాజాలం 48 వార్డుల్లో 38 చోట్ల యథేచ్ఛగా అక్రమాలు పోలీసుల సమక్షంలోనే టీడీపీ మూకల దౌర్జన్యాలు

వైఎస్సార్‌ సీపీకి పట్టున్న బూత్‌లే లక్ష్యం

నరసరావుపేట టౌన్‌: మున్సిపల్‌ ఎన్నికల్లో ఓట్ల లెక్కలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయి. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన ఎన్నికల్లో అక్రమాలు చోటుచేసుకున్నాయనడానికి పోలింగ్‌ గణాంకాలే బలం చేకూరుస్తున్నాయి. పట్టణంలో మొత్తం 48 వార్డుల పరిధిలో 1,07,622 మంది ఓటర్లు ఉండగా.. 75,356 మంది గత గురువారం జరిగిన పురపాలక ఎన్నికల్లో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు మున్సిపల్‌ అధికారులు తెలిపారు. దీంతో 70.02 శాతం పోలింగ్‌ నమోదైనట్లు వెల్లడించారు. అయితే ఎస్‌ఐఆర్‌ (సర్‌) లెక్కల ప్రకారం పట్టణంలో అర్హులైన ఓటర్లు 85,670 మంది మాత్రమే ఉన్నారు. మృతులు, డబుల్‌ ఎంట్రీలు, శాశ్వతంగా వలస వెళ్లినవారు, ఆచూకీ లేనివారిని కలిపి 21,952 మందిని తొలగించాల్సి ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. ఈ లెక్కన పోలైన 75,356 ఓట్లను పరిగణనలోకి తీసుకుంటే 87.96 శాతం.. అంటే దాదాపు 88 శాతం పోలింగ్‌ నమోదైనట్లు కనిపిస్తోంది. అసలు అర్హులైన ఓటర్ల సంఖ్యతో పోలిస్తే ఇంత భారీగా పోలింగ్‌ ఎలా నమోదైందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. మరోవైపు ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌ ప్రక్రియలో 11 గంటల వరకు కేవలం 27 శాతం మాత్రమే నమోదైంది. ఆ తర్వాత పోలింగ్‌ కేంద్రాల్లో చోటుచేసుకున్న దౌర్జన్యాలు, రిగ్గింగ్‌ నేపథ్యంలో పోలింగ్‌ శాతం ఒక్కసారిగా పెరగడం కనిపిస్తోంది. ఎస్‌ఐఆర్‌ లెక్కల ప్రకారం కాకుండా పాత ఓటర్ల జాబితాతోనే ఎన్నికలు నిర్వహించిన విషయం తెలిసిందే.

38 వార్డుల్లో ఓట్ల దోపిడీ..

పట్టణంలోని 48 వార్డుల్లో 38 వార్డుల్లో రిగ్గింగ్‌ జరిగినట్లు వైఎస్సార్‌ సీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. ముఖ్యంగా 47వ వార్డులో 82.35, 2లో 82.11, 34లో 81.68, 3లో 80.87 శాతం పోలింగ్‌ నమోదైంది. ఎస్‌ఐఆర్‌ లెక్కల ప్రకారం ఆయా వార్డుల్లో పోలింగ్‌ 90 శాతం దాటే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. పోలింగ్‌ సజావుగా సాగిన బూత్‌లలో 28వ వార్డులో 55, 40లో 58, 26లో 58.47, 39వ వార్డులో 59 శాతం పోలింగ్‌ నమోదైంది. రిగ్గింగ్‌ జరిగిన బూత్‌లు, పోలింగ్‌ సజావుగా సాగిన బూత్‌లతో పోలిస్తే ఓట్ల దోపిడీ స్పష్టంగా కనిపిస్తోందని ఆరోపణలు వస్తున్నాయి. దీంతో పాటు మరికొన్ని వార్డుల్లో కూడా పోలింగ్‌ శాతం అధికంగా నమోదవడం ఓట్ల చోరీకి సంబంధించిన అనుమానాలను బహిర్గతం చేస్తోంది. చోటుచేసుకున్న ఈ పోలింగ్‌ సరళిపై సమగ్ర విచారణ జరపాలన్న డిమాండ్లు వినిపిస్తున్నాయి.

మీడియాపైనా ఆంక్షలు

పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న పరిణామాలను చిత్రీకరించేందుకు వెళ్లిన మీడియా ప్రతినిధులపైనా ఆంక్షలు విధించారు. పోలింగ్‌ కేంద్రాల్లోకి విలేకరులను అనుమతించకపోవడంతో పాటు, దౌర్జన్యాలను చిత్రీకరించేందుకు ప్రయత్నించిన వారిని పోలీసులు బెదిరించినట్లు జర్నలిస్టులు పేర్కొంటున్నారు. ఎన్నికల సమయంలో మీడియా స్వేచ్ఛకు అడ్డుకట్ట వేయడం వెనుక ఆంతర్యమేమిటన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఆత్మలు ఓట్లు వేశాయా..?

మున్సిపల్‌ ఎన్నికల పోలింగ్‌లో మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. కొన్ని వార్డుల్లో మృతి చెందిన వ్యక్తుల ఓట్లు సైతం పోలైనట్లు తెలుస్తోంది. దీంతో చనిపోయినవారు వచ్చి ఓట్లు వేశారా? అంటూ పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. మృతుల పేర్లపై ఓట్లు ఎలా పోలయ్యాయి? ఓటరు గుర్తింపును సరిగా పరిశీలించారా? పోలింగ్‌ సిబ్బంది ఏం చేస్తున్నారు? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఈ నేపథ్యంలో పోలింగ్‌ కేంద్రాల సీసీటీవీ ఫుటేజీ, వెబ్‌కాస్టింగ్‌ రికార్డులు, ఓటర్ల జాబితాలను పరిశీలించి సమగ్ర విచారణ జరిపించాలని ప్రజాస్వామ్యవాదులు డిమాండ్‌ చేస్తున్నారు.

రామిరెడ్డిపేట, బాలయ్యనగర్‌, పాత సమితి ఆఫీస్‌, ప్రకాష్‌నగర్‌, శ్రీనివాసనగర్‌, పల్నాడు బస్టాండ్‌, బరంపేట తదితర ప్రాంతాల్లో వైఎస్సార్‌ సీపీకి పట్టున్న పోలింగ్‌ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయి. కత్తులు, కర్రలు వంటి మారణాయుధాలతో పోలింగ్‌ కేంద్రాల్లోకి ప్రవేశించిన టీడీపీ శ్రేణులు.. వైఎస్సార్‌ సీపీ కౌన్సిలర్‌ అభ్యర్థులు, ఏజెంట్లపై దాడులకు పాల్పడ్డాయి. బలవంతంగా బయటకు గెంటేశాయి. ఇదంతా పోలీసుల సమక్షంలోనే జరిగినా వారు అడ్డుకునే ప్రయత్నం చేయలేదు. దౌర్జన్యాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేకపోవడంతో పలువురు వైఎస్సార్‌ సీపీ ఏజెంట్లు మధ్యాహ్నానికే పోలింగ్‌ కేంద్రాలను విడిచి బయటకు వచ్చేశారు. బూత్‌లలో ఏజెంట్లు లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని ఓట్ల చోరీకి పాల్పడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement