రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత

Nov 29 2026 1:47 PM | Updated on Nov 29 2026 1:47 PM

గుంటూరు లీగల్‌: రాజ్యాంగ విలువలను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్‌ చక్రవర్తి చెప్పారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని శనివారం గుంటూరులోని జిల్లా పరిషత్‌ కాన్ఫరెన్స్‌ హాల్‌లో ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌(ఐఎల్‌ఏ) ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ చక్రవర్తి హాజరై మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ దేశ ప్రజలకు అందించిన ఓటు హక్కును ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వినియోగించుకోవాలని సూచించారు. డబ్బు, మద్యం తదితర ప్రలోభాలకు లొంగకుండా తమ ఓటును సద్వినియోగం చేసుకోవడమే రాజ్యాంగాన్ని గౌరవించినట్లవుతుందని వివరించారు. అప్పుడే మనకు స్వేచ్ఛ సమానత్వం పొందగలుగుతామని చెప్పారు. న్యాయం చట్టం అందరికీ సమానమే కానీ ప్రజలు సరైన నాయకులను ఎన్నుకున్నప్పుడే సమర్థమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడుతుందని తెలిపారు. మాజీ ఐఏఎస్‌ అధికారి విజయ్‌కుమార్‌ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేసే స్వేచ్ఛతో పాటు, ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా నచ్చిన విధంగా జీవించే హక్కును భారత రాజ్యాంగం కల్పించిందని చెప్పారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగానికి ఎంతో విలువ ఉందని, రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతలను ప్రతి పౌరుడు సద్వినియోగం చేసుకున్నప్పుడే నిజమైన ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని అన్నారు. ఇండియన్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు జి.శాంత్‌ కుమార్‌ మాట్లాడుతూ ఉన్నత న్యాయస్థానాల్లో కూడా సామాజిక న్యాయం, సమానత్వం సాధించే దిశగా రిజర్వేషన్లు కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో గుంటూరు జిల్లా న్యాయమూర్తులు నాగరాజు, చక్రపాణి, శోభారాణి, ఐఎల్‌ఏ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.బ్రహ్మేశ్వరరావు, జిల్లా అధ్యక్షురాలు గీతావాణి, నగర అధ్యక్షులు మొగల్‌ కాలేషా బేగ్‌ పాల్గొన్నారు.

గుంటూరు జిల్లా ప్రధాన న్యాయమూర్తి సాయి కళ్యాణ్‌ చక్రవర్తి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement